తాగిన మైకంలో ఓ భర్త బ్లేడ్‌తో భార్య గొంతు కోసిన ఘటన మండలంలోని ధనోర(బి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన కనడే తూకారంతో ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని భీంనగర్‌కు చెందిన రాధాబాయికి 11 ఏళ్ల కిందట వివాహమైంది.
ఆరేళ్ల కిందట తూకారం కుటుంబంతో సహా ధనోర(బి) గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కొద్దిరోజులుగా తూకారం మద్యానికి బానిసై తరచుగా భార్యతో గొడవపడుతున్నాడు. గురువారం మధ్యాహ్నం తాగిన మైకంలో ఇంటికి వచ్చిన తూకారం భార్యతో గొడవపడి బ్లేడ్‌తో రాధాబాయి గొంతు కోశాడు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి వివరాలు సేకరించారు. వెంటనే రాధాబాయిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం రాధాబాయి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై నాగ్‌నాథ్ తెలిపారు.