ఐదు దశాబ్దాల సంసార జీవితంలో ఎలాంటి కలతలు లేకుండా అన్యోన్యంగా గడిపారు ఆ దంపతులు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి బతుకుదెరువు చూపించారు. బరువు బాధ్యతలన్నీ ముగించుకున్న తరుణంలో భార్య అనారోగ్యంపాలైంది. అంతకంతకూ పెరుగుతున్న తన అనారోగ్య సమస్యలతో భర్త ఇబ్బంది పడకూడదని అగ్నికి ఆహుతైంది. అది కళ్లారా చూసి కలత చెందిన ఆమె భర్త కూడా నీ తోడై వస్తానంటూ.. ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మరణం అందరినీ కలచివేసింది.
చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన పిసాటి మారారెడ్డి(70), మల్లమ్మ(63) దంపతులకు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. మారారెడ్డి గ్రామంలోనే వ్యయసాయం చేసుకుంటున్నాడు. కాగా, కొంత కాలంగా మల్లమ్మ అనారోగ్య సమస్యలతో అవస్థ పడుతోంది. వైద్యం చేయించుకున్నా సమస్య తగ్గకపోగా ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైంది. తన సమస్యతో భర్త, కుటుంబ సభ్యులను బాధపెట్టడం ఇష్టం లేని ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఇది గమనించిన భర్త మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడిన మల్లమ్మ మృతిచెందింది.కళ్లెదుటే భార్య అగ్నికి ఆహుతైపోవడాన్ని మారారెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. అదే రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దంపతుల మృతదేహాలకు చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. దంపతులిద్దరూ ఒకేసారి మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పెద్ద కుమారుడు బాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.