భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో జయచిత్ర నాగరాజు అదృశ్యమయ్యాడు. భార్యే వివాహేతర సంబంధం నేపథ్యంలో అతడిని హత్య చేయించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొన్నూరులో ఆదివారం ఈ ఘటన జరిగింది. నాగరాజు మేనల్లుడు జి.ఏడుకొండలు కథనం ప్రకారం.. పట్టణంలోని 2వ వార్డులో నివాసం ఉంటున్న జలచిత్ర నాగరాజు అలియాస్ ఆది, అతని భార్య సోని స్వస్థలం నెల్లూరు జిల్లా బిట్రగుంట. వీరిద్దరూ 8ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల క్రితం నాగరాజు కుటుంబం పొన్నూరు వచ్చింది. నాగరాజు కారు డ్రైవర్.
కొంతకాలంగా నాగరాజు, సోనీకి మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ రాత్రి నుంచి నాగరాజు కనబడటం లేదు. ఈ నేపథ్యంలో నాగరాజు తొడల్లుడు ఆదివారం సాయంత్రం బంధువులకు ఫోన్ చేసి నాగరాజును అతని భార్య హత్య చేయించిందని చెప్పాడు. దీంతో బంధువులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగరాజు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి నాగరాజు భార్య సోనీని విచారించారు. ఇంటిలో రక్తపు మరకలు ఉండటంతో నాగరాజు బంధువుల అనుమానం బలపడింది.
దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. జాగిలాలు నాగరాజు ఉంటున్న ఇంటి నుంచి పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాల ఏరియాలోని పొలాల్లోకి వెళ్లి నిలిచిపోయాయి. రాత్రి సమయం కావటంతో అవి ముందుకెళ్లలేకపోయాయి. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నాడనే నాగరాజును సోనీ హత్య చేయించి కారులో బాపట్ల సమీపాన ఉన్న కాలువ వద్దకు తీసుకెళ్లి అందులో మృతదేహన్ని పడవేసినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. అయితే మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. నాగరాజు బంధువుల ఫిర్యాదు మేరకు పొన్నూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.