మండలంలోని గలిజేరుగుళ్లలో భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేశాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరగగా శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. కొనకనమిట్ల మండలం గార్లదిన్నెకు చెందిన దూదేకుల బాజీతో బేస్తవారిపేట మండలం అక్కపల్లెకు చెందిన ఖాజీబీ(26)కి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. నిత్యం అనుమానంతో భార్యను వేధిస్తుండటంతో పెద్దలు సర్ది చెప్పి మూడేళ్ల క్రితం ఆమెను అత్తగారింటికి పంపారు.
మామతో పాటు బాజీ బేల్దారి పనులు చేసుకుంటూన్నాడు. మళ్లీ గొడవలు జరగడంతో రెండేళ్లుగా దంపతులు గలిజేరుగుళ్లలో కాపురం ఉంటున్నారు. గురువారం రాత్రి ఏడేళ్ల కొడుకును బయట పడుకోబెట్టి దంపతులు ఇంట్లో గొడవపడ్డారు. కత్తిపీట, బ్లేడ్‌తో భార్య గొంతు కోసి ఆమె చనిపోయిన తర్వాత బయట తలుపునకు తాళం వేసుకుని పీవీపురం చేరాడు. భవన నిర్మాణం చేస్తున్న యజమాని ఆవుల కృష్ణారెడ్డి వద్దకు వెళ్లి గలిజేరుగుళ్లలో పెద్ద గొడవ జరిగిందని, గ్రామస్తులు తనను కొట్టి తరుముకున్నారని, తమ బంధువులు ఉన్న బసినేపల్లెలో మోటార్ సైకిల్‌పై తనను వదిలి పెట్టాలని కోరాడు.
అక్కడ వదిలి పెట్టిన తర్వాత అనుమానంతో అక్కపల్లె వెళ్లి ఖాజాబీ తండ్రి పులిమద్ది సుబ్బయ్యకు సమాచారం అందించాడు. కుమార్తెకు, అల్లుడికి ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో సుబ్బయ్య తన బంధువులతో కలిసి గలిజేరుగుళ్ల వెళ్లాడు. గృహానికి తాళం వేసి ఉండటంతో పగులకొట్టి లోపలికి వెళ్లారు. గొంతుతెగి రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తె మృతదేహం కనిపించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. గిద్దలూరు ఎస్ఐ సుధాకరరావు, ఎస్ఐ బాలకృష్ణలు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.