కట్నం కోసం భార్యని హత్య చేసిన భర్త

కట్నం కోసం భార్యని హత్య చేసిన భర్త

వివాహితను హత్య చేసిన కేసులో భర్తతో పాటు మామ, బావను అరెస్టు చేశారు నెల్లూరు జిల్లా గూడూరు పోలీసులు. డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి కథనం మేరకు… నెల్లూరు నగరానికి చెందిన యల్లంరాజు పద్మతో గూడూరు మండలం కుందకూరుకు చెందిన వెంకట రమణయ్యకు 2018లో వివాహమైంది. కొన్నాళ్లు కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత అదనపు తేవాలంటూ భార్య పద్మను వేధించడం మొదలుపెట్టాడు. దీనికి తోడు పిల్లలు పుట్టకపోవడంతో మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు.

పద్మను ఎలాగైనా వదిలించుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది మార్చి 30న తల్లిదండ్రులు, అన్నతో కలిసి మంచంపై నిద్రిస్తున్న భార్య చేతులు కట్టేసి, నోట్లో దుస్తులు కుక్కి, గొంతు నులిమి చంపేశాడు.. ఎవరికీ అనుమానం రాకుండా పద్మను ఆటోలో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పద్మ మృతి చెందిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు మృతదేహాన్ని పరిశీలించారు.

పద్మ శరీరంపై గాయాలుండటంతో వారు గూడూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శవాన్ని పోస్టుమార్టం చేయించగా ఊపిరానివ్వకుండా చేసి గొంతు నులిమి చంపేసినట్లు తేలింది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. ఆ తర్వాత హత్య కేసుగా మార్పు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం కుందకూరు క్రాస్‌ రోడ్డులో భర్త వెంకట రమణయ్య, మామ వెంకట సుబ్బయ్య, బావ సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి అత్త పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన తాడు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని న్యాయస్థానంలో హాజరుపరిచారు.