రెండు నెలల కిందట పెళ్లైన కొత్త జంట కొండపైకి సరదాగా వెళ్లింది. కొద్దిసేపటికి కంగారుగా వచ్చిన భర్త.. తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో భర్త కదలికలపై సందేహాలు రేగాయి. అతన్ని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో ప్రశ్నించడంతో అసలు నిజం కక్కేశాడు. పెళ్లైన రెండు నెలలకే నవ వధువుని ఆమె భర్తే కిరాతకంగా చంపేసినట్లు తేలింది.
జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ పరిధిలోని జిల్లెలపాడుకి చెందిన మద్దిలేటి, సరోజమ్మ దంపతులు సుమారు ఏడాదిన్నర కిందట వనపర్తి జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపురానికి వలసొచ్చారు. వారి కూతురు శరణ్యకి గట్టు మండలం చిన్నోనిపల్లెకి చెందిన జయరాం గౌడ్‌తో రెండు నెలల కిందట వివాహం జరిపించారు. రెండు రోజుల కిందట వనపర్తి వద్ద ఉన్న తిరుమలయ్య గుట్టకి తీసుకెళ్లాడు. ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి సెల్ఫీ దిగుదామంటూ అమాంతం ఆమెను కిందకు తోసేశాడు. దీంతో శరణ్య గుట్టపై నుంచి పడిపోయి మృతి చెందింది.
అనంతరం భర్త జయరాం హైడ్రామాకు తెరతీశాడు. వెంటనే అయిజ చేరుకుని తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులకి జయరాం కదలికలపై అనుమానం కలిగింది. వెంటనే సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో అడ్డంగా బుక్కయ్యాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న జయరాంని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు విషయం చెప్పేశాడు. తన భార్యను గుట్టపైకి తీసుకెళ్లి తోసేసి చంపేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి తీసుకెళ్లి భార్య మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.