అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో అనంతపురం నగరం ఉలిక్కిపడింది. నాల్గో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని సంగమేష్ నగర్‌కు చెందిన ఆదినారాయణకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వెంగమ్మ అలియాస్ లక్ష్మి (30)తో 15 సంవత్సరాల క్రితం husవివాహమైంది. వీరికి నిఖిల్ (11), రామ్‌చరణ్ (8) అనే పిల్లలున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కొట్టాలు ప్రాంతంలో నివాసముంటూ స్థానిక టమాట మండిలో కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో వ్యక్తితో లక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానాలు ఆదినారాయణలో బలపడ్డాయి. ఈ విషయంగానే దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి.
పాఠశాలకు సెలవు కావడంతో పెద్ద కుమారుడు నిఖిల్‌ను ప్రొద్దుటూరులోని తల్లిదండ్రుల వద్ద లక్ష్మి వదిలింది. ఆదివారం రాత్రి ఇంటిలో చిన్న కుమారుడు రామ్‌చరణ్ నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో లక్ష్మితో ఆదినారాయణ గొడవపడ్డాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోకలిబండతో లక్ష్మి తలపై మోదాడు. అనంతరం కత్తి తీసుకుని అపస్మార స్థితిలో పడి ఉన్న భార్య గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందిన అనంతరం అక్కడి నుంచి ఆదినారాయణ పరారయ్యాడు. సోమవారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ కత్తి శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలో దింపారు.