అనుమానమే పెనుభూతమైంది. నిండు గర్భిణీ అనే విషయం విస్మరించిన భర్త గొడ్డలి వేటుతో పాశవికంగా హతమార్చాడు. ఈ అమానుష ఘటన తూప్రాన్ మండలం కిష్టాపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాధకర సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లా కప్రాలి గ్రామానికి చెందిన సవిత (35) అనే మహిళతో అదే జిల్లా సగ్రోలి గ్రామానికి చెందిన కొండపల్లి శివలింగు గంగారాంతో కోన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు.
కాగ గత నెల రోజుల క్రితం మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కిష్టాపూర్ గ్రామ సమీపంలోని సంతోష్‌రెడ్డి వ్యవసాయ పొలంలో వాచ్‌మెన్‌గా చేరాడు. అక్కడే వ్యవసాయ క్షేత్రంలోని ఓ గదిలో భార్య, పిల్లలతో నివాసం ఉంటున్నారు. అయితే అప్పటికే సవితకు ముగ్గురు పిల్లలు కాగ మళ్లీ గర్భం దాల్చింది. అయితే నిత్యం తన భార్యను అక్రమ సంబంధం పెట్టుకున్నావని వేదిస్తుండేవాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రించారు.
అయితే అప్పటికే పథకం రూపొందించుకున్న భర్త శివలింగు గంగారాం అర్థరాత్రి అందరు పడుకున్న తర్వాత ఇంట్లోని గొడ్డలితో భార్య సవిత తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో సవిత తలపై, మేడపై తీవ్రగాయాలు అయి తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ హత్యనుంచి తప్పించుకోవాలని పంట పొలంకు చెందిన సంతోష్‌రెడ్డికి ఫోన్లో తన భార్యను ఎవరో చంపి వేశారని ఫోన్లో నిందితుడు తెలిపినట్లు ఎస్ఐ తెలిపారు.
అదే రాత్రి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చెరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని, మృతదేహన్ని పోస్టుమార్డం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. ముగ్గురు పిల్లలు అనాథలుగా మారడంతో వారిని అమ్మమ్మ వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు. కాగ మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.