భార్య గొంతును భర్త కోసిన సంఘటన దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఇరికేపల్లి జంగాల కాలనీలో గురువారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో తన భార్య అల్లూరి భవానీ గొంతును భర్త సుధాకర్ కత్తితో కోసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు భవానీ తన భర్త సుధాకర్‌పై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరూ పిల్లలతో కలిసి సుధాకర్, భవానీ, భవానీ తల్లి మాచర్లలో జరిగిన వివాహానికి గురువారం ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో సుధాకర్ వాహనాన్ని అతివేగంతో నడపటంపై భార్య అభ్యంతరం వ్యక్తం చేసి దిగింది.
భవానీతోపాటుగా పిల్లలు, ఆమె తల్లి బస్సులో ఇంటి కి చేరుకున్నారు. తనతో పాటు రాలేదని ఆగ్రహంతో ఊగిపోయిన సుధాకర్ ఇంటికి వచ్చిన తరువాత భార్య భవానీతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో సుధాకర్ కత్తితో భార్య భవానీ గొంతు కోసి పరారయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు భవా నీ దాచేపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. గొంతుకు 16 కుట్లు పడ్డాయి. తన భర్త చేసిన దాడిపై బాధితురాలు భవానీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ ఈ.బాలనాగిరెడ్డికి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.