అనుమానంతో గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను చంపిన భర్త !

Husband who killed his wife without even looking suspiciously pregnant!

పెళ్లయిన నాలుగు నెలలకే ఆమే గర్భం తెచ్చుకుంది. ఏడు నెలలకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. అనుమానంతో భర్తే నిండు గర్భిణి అని చూడకుండా భార్య గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో విషాదం నింపింది. ఆదోని మండలం సంతేకుడ్లురు గ్రామానికి చెందిన సాహెబ్‌ హుసేన్‌, గౌసియా దంపతుల కుమార్తె రజియా(20)ను ఎమ్మిగనూరు పట్టణ నివాసి అయిన నజీర్‌, దాదాబీల కుమారుడు మహబూబ్‌(26)కు ఇచ్చి ఏడు నెలల కిందట వివాహం చేశారు.

మహబూబ్‌ బీరువా తయారీ దుకాణంలో పనిచేస్తున్నాడు. అయితే పెళ్లయినప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న అతడు తరుచూ వేధించేవాడు. ఈ క్రమంలో రజినా గర్భం దాల్చింది. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి అత్తింటికి పంపించారు.

అయినప్పటికీ భర్త వేధింపులు ఆగకపోవడంతో కొద్దిరోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రపోతున్న భార్యతో మహబూబ్‌ మళ్లీ గొడవ పడ్డాడు.

ఆవేశంతో ఆమె గొంతు నులమడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆందోళనపడిన మహబూబ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. సగానికి పైగా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహబూబ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.