తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరేండ్లుగా చక్కగా అమలౌతున్న అన్నపూర్ణ భోజన పథకం అద్భుతంగా ఉందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో భోజనంపై రూ.25 భరిస్తూ రోజుకు రెండు లక్షల మందికి ఆహారం అందిస్తున్నదని ఆయన అభినందించారు. అక్షయపాత్ర భాగస్వామ్యంతో దీన్ని అమలుచేస్తున్నారని.. అయితే కొవిడ్-19 వంటి కీలక సమయంలో భోజనం పెట్టి ఆదుకున్నారని శుక్రవారం ఆయన ట్విట్టర్లో ప్రశంసల జల్లు కురిపించారు.
అదేవిధంగా జీహెచ్ఎంసీలో అన్నపూర్ణ పథకం ద్వారా ఇప్పటివరకు 5.5కోట్ల మందికి భోజనాలు పెట్టినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా వంటి విపత్కపర కాలంలో కూడా సుమారు 65 లక్షల మందికిపైగా భోజనం అందించినట్టు శుక్రవారం ట్విట్టర్లో స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో భోజనాలు పెట్టిన దాఖలా లేదని అన్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అక్షయపాత్ర, సిబ్బందికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.