సాగరమైన నగరం….

సాగరమైన నగరం....

నగరం సాగరమైంది.. వీధులు నదులయ్యాయి. దారులు గోదారుల య్యాయి.. కుండపోత.. గుండెకోతను మిగిల్చింది. నీట మునిగిన ఇళ్లు.. బతుకమ్మలను తలపించాయి. జడివాన.. అలజడి సృష్టించింది. జలఖడ్గానికి జనం కకావికలమయ్యారు. 1,500 పైగా కాలనీలు జలదిగ్బంధమయ్యాయి.. 20,540 ఇళ్లు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. 30 పాతభవనాలు, గోడలు కూలిపోయాయి.. ఇదీ భాగ్యనగరం పరిస్థితి. వందేళ్ల తర్వాత కురిసిన రికార్డు వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురిసిన వానలకు నాలాలు ఉప్పొంగాయి. నగరం చుట్టూ ఉన్న చెరువులు తెగిపోయాయి. కుంటలు పొంగిపొర్లాయి. వాటిల్లో ఉండాల్సిన నీళ్లు రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి చేరాయి. విజయవాడ, కరీంనగర్, వరంగల్‌ మార్గాలు జలమయమయ్యాయి.

జీహెచ్‌ఎంసీలోని ఈస్ట్, సౌత్‌ జోన్లలో ఎక్కువ నష్టం వాటిల్లింది. నగరంలో 1,500 కాలనీలకుపైగా నీట మునిగాయి. సరూర్‌నగర్, గడ్డిఅన్నారం, దిల్‌సుఖ్‌నగర్‌ పాంతాల్లో దాదాపు 200 కాలనీలు జలమయమయ్యాయి. బోయిన్‌చెరువు తెగడం, హస్మత్‌పేట నాలా పొంగిపొర్లడంతో దాదాపు 100 కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఉప్పల్, కుషాయిగూడ, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, కొత్తపేట, బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, మీర్‌పేట, పాతబస్తీలోని పలు కాలనీలు నీటచిక్కి గజగజ వణికాయి. ఇళ్లలోని సామాన్లు కొట్టుకుపోయాయి. వరదనీరు బుధవారం మధ్యాహ్నానికి కూడా తగ్గలేదు. టోలిచౌకి నదీం కాలనీ, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, ఫలక్‌నుమా, కవాడిగూడ అరవింద్‌ కాలనీ, రామంతా పూర్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలను బోట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్, ఆర్మీ తదితర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.