బంజారాహిల్స్‌లో రౌడీషీటర్‌ హల్‌చల్‌

బంజారాహిల్స్‌లో రౌడీషీటర్‌ హల్‌చల్‌

దొంగిలించిన కారులో బంజారాహిల్స్‌లోని సయ్యద్‌నగర్‌కు వచ్చిన ఓ రౌడీషీటర్‌ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో దారిలో వస్తున్న స్కూటరిస్ట్‌ను కత్తితో బెదిరించి ఆ స్కూటర్‌పై పరారయ్యాడు. అయితే పోలీసులు ఛేదించి అతనిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదై ఉన్న ఖాజా ఫరీదుద్దీన్‌ ఖాద్రి అలియాస్‌ మెంటల్‌ ఫరీద్‌ రెండు రోజుల క్రితం మలక్‌పేట్‌లో నివసించే తలీష్‌ ఫేస్‌బుక్‌లో పరిచయం కాగా ఆయన కారును మాయమాటలు చెప్పి దొంగిలించాడు.

ఇదే కారులో బుధవారం అర్ధరాత్రి సయ్యద్‌నగర్‌కు వచ్చాడు. గతంలో అతని సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే తమ్ముడి మృతికి స్నేహితులే కారణమని వారిపై కక్షపెంచుకున్నాడు. ఈ క్రమంలో తమ్ముడి స్నేహితులు సయ్యద్‌నగర్‌లో తారాసపడటంతో వారిని వెంబడించాడు. వేగంగా బండి నడిపి ఆ మార్గంలో వాహనాలను ఢీకొట్టాడు. దీంతో వాహనదారులు ఆయనను వెంబడించడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే నిందితుడి కోసం గాలిస్తున్న గోల్కొండ పోలీసులకు సయ్యద్‌నగర్‌లో ఉన్నట్లు సమాచారం రాగా బంజారాహిల్స్‌ పోలీసులకు చెప్పారు.

బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పెట్రోకారును తన కారుతో ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించాడు. అడ్డు వచ్చిన బంజారాహిల్స్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. దీంతో కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న స్థానికులు ఫరీద్‌ను అడ్డగించారు. కారు దిగి పారిపోతూ ఎదురుగా బైక్‌పై వస్తున్న షేక్‌ అల్ఫాస్‌ను కత్తితో బెదిరించి ఆ స్కూటర్‌పై పరారయ్యాడు.

పోలీసులు వెంబడిస్తుండటంతో స్కూటర్‌తో సహా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో దూరాడు. పోలీసులు ఆస్పత్రిలోకి వెళ్ళి మెంటల్‌ ఫరీద్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించగా తన వద్ద ఉన్న కత్తితో ఓ రోగి మెడపై కత్తి పెట్టి తనను పట్టుకుంటే మెడకట్‌ చేస్తానంటూ బెదిరించాడు. చాకచక్యంగా పోలీసులు ఫరీద్‌ను పట్టుకొని అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై హబీబ్‌నగర్, గోల్కొండ, మలక్‌పేట, నాంపల్లి పోలీస్‌ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.