హ్యుందాయ్ విద్యుత్ కారు వచ్చేసింది..

hyundai kona electrical car launched in india

సింగిల్ చార్జ్‌తో 452 కిలోమీటర్లు.. ధర రూ.25.30 లక్షలు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందా య్.. తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనమై ఎస్‌యూవీ కోనను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఊతమిచ్చేలా కంపెనీ మంగళవారం ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

విద్యుత్‌తో నడిచే వాహనాలపై పన్ను రాయితీలు ఇవ్వనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించడం శుభసూచికమని, అయినప్పటికీ కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని హెచ్‌ఎంఐఎల్ ఎండీ, సీఈవో ఎస్‌ఎస్ కిమ్ తెలిపారు. ప్రస్తుతం విద్యుత్‌తో నడిచే వాహనాలు తయారు చేయడం చాలా ఖరీదుతో కూడుకున్న విషయమన్నారు. ఈ నూతన కారు దేశీయ ఈవీల మార్కెట్‌ను పూర్తిగా మార్చివేయనున్నదని చెప్పారు. ఒక్కసారి రీచార్జి చేస్తే ఈ కారు 452 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించనున్నదని కంపెనీ వర్గా లు వెల్లడించాయి. విభిన్న డ్రైవింగ్ సదుపాయం కలిగిన ఈ కారులో పలు నూతన ఫీచర్స్ ఉన్నాయని,
136 పీఎస్ శక్తిని ఇచ్చే ఈ కారు కేవలం 9.7 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత. కారు బ్యాటరీ పూర్తిస్థాయిలో చార్జింగ్ కావడానికి ఆరు గంటల సమయం పట్టనున్నది. భద్రత ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంలో భాగంగా ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ కలిగిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఒత్తిడిన తట్టుకునే విధంగా టైర్లు, రియర్ కెమెరా వంటివి ఉన్నాయి.

హైదరాబాద్ పరిశోధన కేంద్రంలో డిజైనింగ్..

హైదరాబాద్‌లో ఉన్న పరిశోధన కేంద్రంతోపాటు కొరియాలో ఉన్న ఆర్ అండ్ డీ సెంటర్లు ఈ కారును తీర్చిదిద్దినట్లు కిమ్ చెప్పారు. చెన్నైలో ఉన్న ప్లాంట్లోనే ఈ కారును తయారు చేయడానికి అత్యధికంగా విడిభాగాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నది. ప్రస్తుతానికి ఈ కారు దేశవ్యాప్తంగా 11 నగరాల్లో మాత్రమే విడుదల చేయనున్నట్లు, ముఖ్యం గా చార్టింగ్ స్టేషన్లు ఉన్న నగరాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి చమురు విక్రయ దిగ్గజం ఇండియన్ ఆయిల్‌తో ఒప్పం దం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది.