విజయ్ ని ఏమీ అనలేదన్న విశ్వక్ సేన్

i didnt says anything to vijay

ఇండస్ట్రీలో తనను తొక్కేయడానికే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు హీరో విశ్వక్ సేన్. తాజాగా ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించడమే కాకుండా స్వీయ దర్శకత్వం వహించి నిర్మించారు. కాగా ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంపై కొంత మంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని.. వాళ్ల సంగతి హైదరాబాద్ వచ్చాక చూస్తా అంటూ విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బూతుల దండకం అందుకున్నారు. దీంతో విశ్వక్ సేన్ బూతులు తిట్టింది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌నే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో సోమవారం నాడు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు విశ్వక్ సేన్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే.. నేను నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో కొందర్ని తిట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. నేను మొదటి నుండి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతా. తాజాగా నేను షేర్ చేసిన 40 సెకన్ల వీడియోలో చివరి 6 సెకన్లు కట్ చేసి ఎవర్ని అన్నాడు అన్న డైలామాలో ఉండేట్టు చేశారు. అందువల్ల నేను పలానా హీరోని (విజయ్ దేవరకొండ) అన్నట్టుగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నేను నిన్న మాట్లాడింది ఎవరి గురించి అంటే.. ఐదు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు నా లైఫ్ సెటిల్ అయ్యేట్టుగా సినిమా తీయొచ్చు. కాని నేను 80 కొత్త వాళ్లను పెట్టి రెండు సంవత్సరాలు కష్టపడి సినిమా తీస్తే ఆ సినిమా గురించి పనికట్టుకుని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా నా సినిమా పోస్టర్స్ కూడా చింపేశారు. పైగా నేను ఎవర్నో ఉద్దేశించి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. నేను ఏ రివ్యూ రైటర్‌ని అనలేదు. మీడియాని ఉద్దేశించి మాట్లాడలేదు. ఏ హీరోని అనలేదు. ఈ సినిమాని పనికట్టుకుని పైరసీ చేస్తున్నారు. విడుదలైనప్పటి నుండి పైరసీ లింక్‌లను డిలీట్ చేస్తూనే ఉన్నాం. వీటివల్ల నా సినిమాకి నష్టం కలిగింది. ఈ బాధలో ఒక మాట అనేశా. కంట్రోల్ తప్పి నోరు జారాను. దానికి సారి చెబుతున్నా. నేను అలా అనాల్సింది కాదు.. కాని నాకు బాగా కాలింది అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది.నా సినిమా పోస్టర్‌లు లక్షలు పోసి వేయిస్తే వాటిని చింపేశారు అంత అవసరం దేనికి? నేను పలానా హీరోని, ఆడియన్స్‌ని తిడుతున్నా అంటున్నారు. నాకు అంత అవసరం లేదు. నేను ఎవరికీ సవాల్ చేయలేదు.. ఎవరి ఫ్యాన్స్‌ని తిట్టలేదు. ఎవరు చింపారు అని అడిగా? దానికి కొంతమంది భుజాలు తడుముకుంటున్నారు. నేను రివ్యూ రైటర్లను అనలేదు. ఒకవేళ నేను అన్నట్టుగా నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేసి వెలిపోతా’ అంటూ ఆవేదన  వ్యక్తం చేశారు విశ్వక్ సేన్.