టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కెరీర్ తన వల్లే ముగిసిందని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న పాకిస్తాన్ పేస్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 2012లో పాకిస్తాన్లో భారత పర్యటన సందర్భంగా గంభీర్ వైట్ బాల్ కెరీర్‌కు తానే తెరిదించానని ఆయన ఇర్ఫాన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గంభీర్‌ను టీమిండియా నుంచి తప్పించకమునుపు తాను అతడిని షార్ట్ బంతులు, బౌన్సర్లతో ఇబ్బందులు పెట్టానని చెప్పారు. ఈ టూర్లో ఇర్ఫాన్ రెండు సార్లు గంభీర్‌ను అవుట్ చేశాడు. గంభీర్ తన చివరి టీ20ని ఆ సిరీస్‌లోనే ఆడి ఆ తర్వాత టీ20లో ఎన్నడూ తిరిగి అడుగుపెట్టలేదు
ఇక గంభీర్ 2013 జనవరిలో ఇంగ్లండ్‌పై తన చివరి వన్డే ఆడాడు. కాగా పాకిస్తాన్ స్పోర్ట్స్ ప్రెజంటర్ సవేరా పాషాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ గంభీర్‌పై చేసిన ప్రకటన గురించి వివరణ ఇచ్చారు. తన బౌన్సర్లను ఆడేందుకు గౌతం గంభీర్ చాలా ఇబ్బంది పడ్డాడని, తన సహజ సిద్ధమైన ఆటను ఆడలేకపోయాడని చెప్పాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ల్లో బాగా ఆడేవారిని హీరోలుగా చూస్తే..ఆడని వారిని జీరోలుగా చూస్తారని అన్నాడు. తన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో గంభీర్ తడబడ్డాడని, గంభీర్ సహజసిద్ధంగా ఆడలేకపోతున్నాడని ప్రతిఒక్కరూ అన్నారని క్రిక్ కాస్ట్ చాట్ షోలో ఇర్ఫాన్ వివరణ ఇచ్చారు. గంభీర్ పేలవ ప్రదర్శనతో అతడిని జట్టునుంచి తప్పించారని, ఆ తర్వాత ఆయన ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లో కూడా సరైన సామర్ధ్యం కనబర్చలేదని, అందుకే తాను అలా వ్యాఖ్యానించానని చెప్పారు.