దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార ఘటనలో పాశవిక అత్యాచారానికి గురై, మరణించిన ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా తరపున వాదిస్తున్న న్యాయవాది దీపికా రజావత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎందరినో తీవ్ర విభ్రాంతికి గురిచేస్తున్నాయి. సంప్రదాయ కాశ్మీరీ పండిట్ కుటుంబం కి చెందిన దీపికా రజావత్, బాకర్వాలా అనే గిరిజన ముస్లిం జాతికి చెందిన బాలిక తరపున వాదించడంని జీర్ణించుకోలేని మూర్ఖ ఛాందసవాదులు ఇప్పటికైనా ఈ కేసు నుండి తప్పుకోవాలని, లేకుంటే తన కుటుంబాన్ని మొత్తం అంతం చేస్తామని, దీపికాని, తన పాప ని అత్యాచారం చేసి మరీ హత్యచేస్తామని హెచ్చరికలు చేస్తూ, బెదిరిస్తున్నా తాను నమ్మిన విలువలకు కట్టుబడి, ఎవరో ఒకరు ఏదో ఒక రోజు తనని హత్య చేస్తారనే విషయం తనకి తెలుసని, అయినా వారు చేసే హెచ్చరికలకు తలొగ్గనని, బ్రతికి ఉన్నంతవరకు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేందుకు సర్వశక్తులా కృషిచేస్తాననని ప్రకటించారు.
తాను ప్రతిరోజూ ఇల్లు చేరుకోగానే గేట్ వద్ద నుండి ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించుకుంటూ ఇంటిలోపలికి వెళ్తానని, ఏ క్షణాన నా కుటుంబం గురించి ఎటువంటి వార్త వినాల్సివస్తుందోనని కంగారు పడుతుంటానని, నా భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నా ఇంటి చుట్టూ ఏర్పాటుచేసిన కాపలాని దాటుకొని, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఏదో ఒకరోజు నన్ను చంపేస్తారనే విషయం తెలుసునని, అయినా న్యాయం చేకూరేవరకు ఈ కేసు నుండి తప్పుకోనని అన్నారు.కథువా రేప్ కేసుగా పరిగణించబడుతున్న ఈ కేసు విషయానికి వస్తే, జమ్మూ-కాశ్మీర్ లోని రసన గ్రామానికి దగ్గరలో ఉన్న కథువా కి చెందిన అసిఫా అనే 8 ఏళ్ళ చిన్నారి జనవరి 10 న అదృశ్యం అయ్యింది. తరువాత వారం అనగా జనవరి 17 న ఆ చిన్నారి శవం గ్రామం వెలుపల గ్రామస్థులకు దొరికింది.
ఆ చిన్నారికి మత్తుమందు ఇచ్చి, కొన్ని రోజులపాటు అత్యాచారం చేసి, ఆ తరువాత హత్య చేశారని తెలిసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు ని త్వరితగతిన పూర్తి చేయాలని కాశ్మీర్ రాష్ట్రప్రభుత్వం పోలీసులను ఆదేశించగా, ఏప్రిల్ లో 8 మంది ని అరెస్ట్ చేసి, కేసు ఫైల్ చేశారు. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా పాంథేర్స్ పార్టీ ఇతర లోకల్ గ్రూపులతో కలిసి నిరసనలు తెలిపింది. ఈ కేసులో ఎటువంటి ప్రగతి కనిపించకపోవడంతో సిబిఐ కి ఈ కేసు అప్పజెప్పాలని చేసిన నిరసనలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ పంజాబ్ లోని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కి అప్పగించింది.
వోగ్ – క్రూసేడర్ అఫ్ ది ఇయర్ – 2018 గా ఎంపికైన దీపికా రజావత్ తన అనుభవాలని పంచుకుంటూ “మత్తుమందు ఇచ్చి, రోజుల తరబడి పాశవికంగా అత్యాచారానికి గురైన అసిఫా అనే ఆ 8 ఏళ్ళ ఆ చిన్నారి, ఎంత నరకయాతన అనుభవించి ఉంటుందో ఒక మహిళగా, తల్లిగా నాకు తెలుసు. ఒక న్యాయవాదిగా నేను బాధితురాలి కుటుంబం తరపున నిలబడి, వారికి న్యాయం చేకూరేవరకు పోరాడుతాను” అని చెప్పారు.