Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ ఏడాది కాలంలో క్రికెట్ ఆడే దేశాలన్నీ అనేక మ్యాచ్ లు ఆడాయి. టీ 20లు, వన్డేలు, టెస్టులు ఇలా ఆయా దేశాలన్నీ మూడు రకాల సిరీస్ ల్లో పాల్గొన్నాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టెండీస్ ఇలా చాలా దేశాల ఆటగాళ్లూ తీరిక లేకుండా క్రికెట్ అభిమానులుకు వినోదం పంచాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కూడా జరుగుతోంది. కానీ ఈ దేశాల మధ్య జరిగిన ఏ మ్యాచ్ ల్లోని సంఘటనలూ ఈ ఏడాది బెస్ట్ మూమెంట్లుగా నిలవలేకపోయాయి. భారత్ పాకిస్థాన్ మధ్య జూన్ లో జరిగిన ఓ మ్యాచ్ లోని మూమెంట్ కు ఆ ఘనత దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జరిగిన ఈ మూమెంట్ ను ఈ ఏడాది స్పిరిట్ ఆఫ్ మూమెంట్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎంపిక చేసింది.
భారత్ – పాకిస్థాన్ మధ్య ఇంగ్లండ్ లో ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత చోటుచేసుకున్న సన్నివేశం అది. జూన్ 18న చిరకాల ప్రత్యర్థులు భారత్ -పాక్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయి. అప్పటికే లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించిఉంది. వరల్డ్ కప్ ల్లో రెండు దేశాలు తలపడినప్పుడు పాకిస్థాన్ కన్నా భారత్ పేరిటే ఎక్కువ విజయాలు ఉన్నాయి. అందుకే ఫైనల్ మ్యాచ్ లో భారతే హాట్ ఫేవరెట్ అని, పాక్ గెలిచే అవకాశమే లేదని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పాక్ 180 పరుగుల భారీ తేడాతో భారత్ పై ఘనవిజయం సాధించింది.
భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు కానీ… ఆటగాళ్లు మాత్రం చాలా హుందాగా స్వీకరించారు. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ సెర్మనీకి ఇరు జట్ల ఆటగాళ్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత ఆటగాళ్లు కోహ్లీ, యువరాజ్ సింగ్ పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్, బౌలింగ్ కోచ్ అజార్ మహమూద్ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఓడిపోయినప్పటికీ ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తితో వ్యవహరించారంటూ అప్పట్లో ఇరుజట్ల ఆటగాళ్లపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు అదే వీడియో ఈ ఏడాది బెస్ట్ మూమెంట్ గా నిలిచింది. ఈ విషయాన్ని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొంటూ ఆ వీడియోను పోస్ట్ చేసింది.
#SpiritOfCricket #CT17 #BestOf2017 pic.twitter.com/C9IPjaehFR
— ICC (@ICC) December 7, 2017