అలాగైతే బందీలు ప్రాణాలతో ఉండరు.. ఇజ్రాయెల్ కు హమాస్ హెచ్చరిక

If so, the hostages will not survive.. Hamas warning to Israel
If so, the hostages will not survive.. Hamas warning to Israel

గాజాలో హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఉత్తర గాజాలో భూతల పోరాటం ఉద్ధృతమైంది. దక్షిణ గాజాలో బాంబుల మోత మోగుతోంది. ఖైదీల విడుదల కోసం తాము చేసిన డిమాండ్లు నెరవేరకపోతే ఇజ్రాయెల్కు చెందిన బందీలు సజీవంగా గాజా నుంచి బయటపడలేరని హమాస్ బెదిరింపులకు పాల్పడింది. ఈ హెచ్చరికల తర్వాత కూడా సోమవారం ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.

‘మా ఖైదీల విడుదల, చర్చలు లేకుండా ఇజ్రాయెల్ బందీలు సజీవంగా తమ స్వదేశానికి వెళ్లలేరు’ అని ఆదివారం హమాస్ బెదిరించింది. గాజాలో హమాస్ చెరలో 137 మంది బందీలు ఉండగా.. 7 వేల మంది పాలస్తీనీయులు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రదాడి అనంతరం గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్ మిలిటెంట్లు వెంటనే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. హమాస్ ముగింపు దగ్గరపడిందని ఆయన అన్నారు.

ఓవైపు కాల్పుల విరమణను చేపట్టాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నా ఇజ్రాయెల్ విరమించడం లేదు. కాల్పుల విరమణ కోసం ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంతో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్ని తీవ్రతరం చేసింది. ఈ పోరులో తీవ్రంగా ధ్వంసమైన అల్షిఫా ఆసుపత్రిలో ఇప్పటికీ 30 వేల మంది ఆశ్రయం పొందుతున్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘మా జీవితం నరకప్రాయంగా ఉంది. ఆహారం, నీరు, కరెంటు లేదు. అనారోగ్యంతో బాధపడుతోన్న చిన్నారులకు ఔషధాలు అందడం లేదు’ అని ఓ వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2.4 మిలియన్ల గాజా జనాభాలో 1.9 మిలియన్ల మంది తమ ఇళ్లను వదిలి పారిపోయారు. అందులో దాదాపు సగం మంది పిల్లలే ఉన్నారని ఐరాస అంచనా వేసింది. వారిని దక్షిణ గాజాకు వెళ్లిపొమ్మన్న ఇజ్రాయెల్.. ప్రస్తుతం అక్కడ కూడా దాడులు చేస్తుండటంతో శరణార్థుల రక్షణ ప్రమాదంలో పడింది. హమాస్ ఆరోగ్య శాఖ తెలిపిన లెక్కల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటివరకు 17,900 మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారు.