ఆంధ్రప్రదేశ్ లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి వైసీపీ నేతలే కారణమంటూ ఈమధ్య వార్తలు తెగ షికార్లు చేశాయి. అయితే చంద్రబాబు మెప్పు కోసం అఖిలప్రియ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. కర్నూలు జిల్లా సమస్యలు తెలియని అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదని.. అవగాహన లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
కర్నూలు జిల్లాలో కరోనా రాజకీయం వేడెక్కింది. వైఎస్సార్సీపీ-టీడీపీ మధ్య మాటా మాటా పెరుగుతోంది. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కర్నూలులో కరోనా వ్యాప్తికి ఎమ్మెల్యే తీరు కారణమని అఖిల ఆరోపించడంతో రగడ మొదలైంది. ఆమె వ్యాఖ్యలకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.. ఓ సవాల్ విసిరారు. అదేమంటే… తనపై అఖిలప్రియ చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఉరేసుకొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. తన వల్ల, ఎంపీ సంజీవ్‌కుమార్ వల్ల కరోనా వ్యాపించిందని అఖిలప్రియ నిరూపించాలని సవాల్ విసిరారు.
అధికారులతో విచారణ జరిపించుకోవచ్చని.. ఒకవేళ తమ తప్పు ఉందని తేలితే కర్నూలు సెంటర్లో ఉరి తీయాలి అన్నారు. తన సవాల్‌కు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తాను అందరికంటే ముందు వరుసలో ఉన్నానని.. ముందు మసీదులు బంద్ చేయించానని.. ఢిల్లీ తబ్లిగీ జమాత్ నుంచి వచ్చిన వారి ఇంటింటికీ వెళ్లి 24 గంటల్లో వారిని క్వారంటైన్ కేంద్రాలకు తీసుకుని వెళ్లాను అని వివరించారు హఫీజ్ ఖాన్.