Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మనం నిత్యం ఉపయోగించే ఆహారపదార్థాల్లో కొన్ని వ్యర్థంగా మిగిలిపోతుంటాయి. వాటిల్లో ఉల్లిగడ్డల పొట్టు ఒకటి. ఈ పొట్టు తీయడం కూడా కష్టమైన పని. ఉల్లిగడ్డలు కోసే సమయంలో పొట్టు తీస్తూ విసుక్కుంటూ ఉంటాం కూడా. అంతేకాకుండా ఉల్లిగడ్డలు తీసుకునే క్రమంలో పొట్టు ఎక్కడపడితే అక్కడ పడి చిరాకుగా కూడా అనిపిస్తుంటుంది. అయితే ఇకనుంచి ఉల్లిగడ్డ పొట్టును చూసి అలా కోపం తెచ్చుకోకూడదు. అలాగే పనికిరానిదని పారేయనూ కూడదు. ఎందుకంటే ఆ పొట్టుతో మనం బల్బులు వెలిగించుకోవచ్చు. లాప్ ట్యాప్, ఫోన్లు చార్జింగ్ పెట్టుకోవచ్చు… ఇలా విద్యుత్ ఉపయోగించి చేసే పనులు ఎన్నింటినో ఉల్లిగడ్డ పొట్టు ద్వారా చేసుకోవచ్చు. ఎలా అంటారా…ఆ పొట్టునే విద్యుత్ గా మార్చడం ద్వారా. నమ్మశక్యంగా అనిపించడం లేదా… కానీ అదే చేసి చూపించారు ఐఐటీ ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు.
ఉల్లిగడ్డ పొట్టుతో విద్యుత్ ఉత్పత్తిచేసే ఓ పరికరాన్ని రూపొందించారు ఆ శాస్త్రవేత్తలు. ప్రొఫెసర్ భానుభూషణ్, పీహెచ్ డీ స్కాలర్ సుమంతా కుమన్ కరణ్ కలిసి ఈ అద్భుతాన్ని సృష్టించారు. దక్షిణ కొరియాలోని పోహాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్త జిన్ కోన్ కిమ్ ఆధ్వర్యంలో ఈ పరికరాన్ని ఆ శాస్త్రవేత్తలు ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. నానో ఎనర్జీ జర్నల్ ఈ విషయాన్ని ప్రచురించింది. ఉల్లి పొట్టు పెద్ద ఎత్తున వృథా అవుతున్న విషయాన్ని గమనించే ఈ ప్రయోగం చేపట్టామని ప్రొఫెసర్ భానుభూషణ్ చెప్పారు. ప్రస్తుతం ప్రయోగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఈ పరికరానికి నానో జనరేటర్ అని నామకరణం చేశామని తెలిపారు. ఉల్లిపొట్టులో పియోజ్ ఎలక్ట్రిక్ గుణాలు ఉన్నాయని, ఇవి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయని వివరించారు. హాఫ్ ఇంచ్ ఉల్లిపొట్టుతో 20వోల్టుల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని, ఆరు ఉల్లిగడ్డల పొట్టుతో 80 ఎల్ ఈడీ బల్బులను వెలగించవచ్చని తెలిపారు. ల్యాప్ ట్యాప్, ఫోన్లు చార్జింగ్ కూడా చేసుకోవచ్చన్నారు. ఈ టెక్నాలజీని అందరూ వినియోగించుకునేలా అభివృద్ధి చేస్తున్నామని భానుభూషణ్ వెల్లడించారు.