ఇలియానాకి జంటగా అభిషేక్‌ బచ్చన్‌

ఇలియానాకి జంటగా అభిషేక్‌ బచ్చన్‌

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌, నటి ఇలియానా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది బిగ్‌ బుల్‌’. ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను చిత్రం బృందం మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో అభిషేక్‌ బచ్చన్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘ఇది ‘ది బిగ్‌ బుల్‌’ సినిమాలోని ఇలియానా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌. భారత దేశ ఆర్థిక వ్యవస్థలోని నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్న క్రైం డ్రామా చిత్రం. త్వరలో ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది’ అని క్యాప్షన్‌ జత చేశారు. ఈ ఫస్ట్‌ లుక్‌లో ఇలియానా ముఖంలో తీవ్రమైన ఎక్స్‌ప్రెషన్‌ కలిగి, నల్లని సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు.

ఇలియానా కూడా ‘ది బిగ్‌ బుల్‌’ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషపడుతున్నాను’ అని క్యాప్షన్‌ జత చేశారు. ది బిగ్ బుల్ సినిమా అనేక ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ స్టాక్ బ్రోకర్‌కు సంబంధించిన కథతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నికితా దత్తా, సోహుమ్‌ షా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కూకీ గులాటి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గన్‌, ఆనంద్‌ పండిట్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల డిస్నీ, హాట్‌స్టార్ నిర్వహించిన వర్చువల్ విలేకరుల సమావేశంలో ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ‘ది బిగ్ బుల్’ సినిమా 80, 90ల్లో ముంబైలో జరిగిన కథ అని అభిషేక్‌ బచ్చన్‌ వెల్లడించారు.