పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాను మరింత ప్రమాదకరంగా మారుతానని గురువారం హెచ్చరించారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా పెషావర్‌లో బహిరంగ ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రమాదకారి కాదు. కానీ ఇప్పుడు నేను మరింత ప్రమాదకారిగా మారుతా’నని పేర్కొన్నారు. అయితే అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి దిగిపోయి వారం కూడా గడవకముందే ఇమ్రాన్ ఖాన్ ఇలా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
అంతేగాక పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం అర్ధరాత్రి దాకా న్యాయస్థానం తలుపులు తెరవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలపాలని డిమాండ్ చేశారు. ‘నేను న్యాయవ్యవస్థను అడుగుతున్నాను, మీరు అర్ధరాత్రి వరకు కోర్టును ఎందుకు తెరిచి ఉంచారు. ఈ దేశం నాకు 45 సంవత్సరాలుగా తెలుసు. నేను ఎప్పుడైనా చట్టాన్ని ఉల్లంఘించానా? నేను క్రికెట్ ఆడినప్పుడు ఎవరైనా నన్ను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారా’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
చదవండి: ఇమ్రాన్ ఖాన్ కక్కుర్తి పని బట్టబయలు
పాకిస్థాన్‌లోని తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రతిపక్ష పార్టీల సహాయంతో వాషింగ్టన్లో విదేశీ శక్తులు కుట్ర పన్నినట్లు ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. ఆదివారం నుంచి మొదలైన ప్రజల నిరసనలు ఉద్ధేశిస్తూ.. ‘మేము దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని అంగీకరించము. ఈ చర్యకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో చూపించారు. ప్రతిసారీ ఒక ప్రధానమంత్రిని తొలగించినప్పుడు ప్రజలు పండగ జరుపుకుంటారు, కానీ నన్ను పదవి నుండి తొలగిస్తే ప్రజలు నిరసనలు చేస్తున్నారు’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
కాగా అనేక నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడిన విషయం తెలిసిందే. గత ఆదివారం జరిగిన జనరల్ అసెంబ్లీ అవిశ్వాస ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్ ఓటమిపాలయ్యారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయారు. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ రికార్డుల్లో నిలిచారు. అనంతరం పాక్‌కు 23వ ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్‌ను ఎన్నికయ్యారు. మూడు సార్లు పాక్ కు ప్రధానిగా పనిచేసిన నవాబ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ ఖాన్.