స్టెరిలైట్ స‌మీప గ్రామంలో ఇంటికో క్యాన్స‌ర్ పేషెంట్…

In A Village 3 Km From Sterlite Plant, Every Other House Has A Cancer Patient

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తూత్తుకుడి కాల్పులపై దేశ‌వ్యాప్తంగా ఆగ్ర‌హ‌జ్వాల‌లు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ కీల‌క ఆదేశాలు జారీచేసింది. స్టెరిలైట్ ప్లాంట్ ను వెంట‌నే మూసేయాల‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఇ.ప‌ళ‌నిస్వామి ఆదేశించారు. క్యాబినెట్ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రోవైపు స్టెరిలైట్ కంపెనీ తూత్తుకుడిలో క‌లిగించిన న‌ష్టంపై సంచ‌ల‌నక‌ర విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. ప్లాంట్ కు మూడు కిలోమీట‌ర్ల దూరంలోని సిల్వ‌ర్ పురం గ్రామంలో ప్ర‌తి ఇంట్లో ఓ క్యాన్స‌ర్ పేషెంట్ ఉన్నారంటే ఈ ప్లాంట్ స్థానికుల జీవితాల‌ను ఎంత అల్ల‌క‌ల్లోలం చేసిందో అర్ధం చేసుకోవ‌చ్చు. సిల్వ‌ర్ పురం గ్రామంలో నివ‌సిస్తున్న 2వేల మంది ప్ర‌జ‌లు స్టెరిలైట్ కంపెనీ వ‌ల్లే త‌మ బ‌తుకులు నాశ‌న‌మ‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. రాష్ట్ర పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు టెస్టుల్లో కూడా విస్తుపోయే నిజాలు వెల్ల‌డ‌య్యాయి.

ప్లాంట్ వదులుతున్న వ్య‌ర్థాల్లో లెడ్ లాంటి హానికార‌కాలు 39 నుంచి 55 రెట్లు అధికంగా ఉన్న‌ట్టు తేలింది. ఈ ప్లాంట్ డంప్ చేస్తున్న వ్య‌ర్థాల్లో ఉన్న జిప్సం భూగ‌ర్భ జ‌లాల‌ను విషంగా మారుస్తున్నాయి. ఈ విష‌జలాలు క్యాన్సర్ మ‌హ‌మ్మారిని వ్యాప్తిచేస్తూ ప్ర‌జ‌ల జీవితాల‌ను నాశ‌నం చేశాయి. 1996లో వేదాంత లిమిటెడ్ కు చెందిన స్టెరిలైట్ కంపెనీ తూత్తుకుడిలో నాలుగు లక్ష‌ల ట‌న్నుల వార్షిక సామ‌ర్థ్యంతో ఈ ప్లాంట్ ను స్థాపించి రాగిని ఉత్ప‌త్తి చేస్తోంది. ఈ ప్లాంట్ వ‌ల్ల భూగ‌ర్భ జ‌లాలు త‌గ్గుతున్నాయ‌ని, ఉద్గారాలు, ప‌ర్యావ‌ర‌ణాన్ని కాలుష్యం చేస్తున్నాయ‌ని, క్యాన్స‌ర్ వంటి రోగాలు ప్ర‌బ‌లుతున్నాయ‌ని 22 ఏళ్ల‌గా స్థానికులు ఆందోళ‌న చేస్తూనే ఉన్నారు. ఇటీవ‌లి కాలంలో ఆందోళ‌న‌లు ఉధృత రూపు దాల్చాయి. వారం క్రితం నిర‌స‌న‌లు హింసాత్మంగా మారి పోలీసులు జరిపిన కాల్పుల్లో 13మంది చ‌నిపోయారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ప్లాంట్ ను శాశ్వ‌తంగా మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.