ఏపీలో కాంగ్రెస్,టీడీపీ జోడీ?

In AP Congress and TDP being one

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరు అంటారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా అలాంటి కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యేందుకు కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకత అనే పునాదుల మీద ఏర్పడింది. గడిచిన 35 ఏళ్లుగా జాతీయ,రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. అప్పుడు బీజేపీ ఉనికి నామమాత్రం. ఇప్పుడు ఆ పార్టీని ఓడించడానికి సర్వశక్తులూ ఒడ్డడానికి మిగిలిన పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. సొంతంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి అస్సలే లేదు. అందుకే సంకీర్ణ ప్రభుత్వం అయినా ఏర్పాటు చేయలేకపోతే పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది అన్న విషయం కాంగ్రెస్ కి అర్ధం అయ్యింది. అందుకే విశ్వసనీయ మిత్రుల కోసం వేట మొదలుపెట్టింది. ఆ కోవలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రాలో టీడీపీ తో పొత్తు ఆలోచన చేస్తోందట 10 జన్ పథ్.

బీజేపీ తో పొత్తు ఉన్నప్పటికీ రాజకీయంగా ఆ పార్టీ వైఖరి చంద్రబాబుకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ప్రత్యేక హోదా సహా ఎన్నో విషయాల్లో బీజేపీ వైఖరి పట్ల జనంలో కూడా సానుకూలత లేదు. కానీ కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏదో ఒక జాతీయ పార్టీ అండ కావాలి. చంద్రబాబుకి వున్న ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ నుంచి పొత్తు ప్రతిపాదన రెడీ అవుతోందట. ఇంతకుముందు జగన్ గురించి ఆలోచించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఆలోచన పక్కనబెట్టిందట. వైసీపీ అధినేత జగన్ పదేపదే బీజేపీ తో అంటకాగుతున్న విషయం కూడా కాంగ్రెస్ లో చంద్రబాబుతో పొత్తు ఆలోచనకి అంకురార్పణ చేసిందట. ఇక సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా కూడా చంద్రబాబు బాధ్యతాయుతంగా వ్యవహరించడాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న సోనియా, రాహుల్ ఈ పొత్తు ఆఫర్ కి తుది మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ వ్యవహారాల్ని చక్కదిద్దే ఓ సీనియర్ నాయకుడికి ఈ బాధ్యతల్ని అప్పగించారట. ఇంతకుముందు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు ఉమ్మడి ఏపీ కి పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా పనిచేసిన అనుభవం కూడా వున్న నేత త్వరలో ఇదే పని మీద రంగంలోకి దిగబోతున్నారు. ఆయన సక్సెస్ అయితే ఒక్క ఏపీ విషయంలోనే గాకుండా మొత్తం దేశ రాజకీయాల్లో కాంగ్రెస్,టీడీపీ జోడి అనేది సరికొత్త సమీకరణాలకు దారి తీస్తుంది అనడంలో సందేహం లేదు.