అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. ఈసారి ఏకంగా 16 మంది దుర్మరణం చెందారు. 60 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యంలో తరచూ కాల్పులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా విదేశీయులపై కాల్పులు తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా లెవిస్టన్, మైనే ప్రాంతాల్లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో 16 మంది మృతి చెందగా.. దాదాపు 60 మందికి గాయాలైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించగా.. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన దుండుగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నివాసితులు తమ ఇళ్ల తలుపులు మూసి ఇంట్లోనే ఉండాలని.. పోలీసులు వీధుల్లోకి రావొద్దని సూచించారు. మరోవైపు ఫేస్‌బుక్ పేజీలో అనుమానితుడి రెండు ఫొటోలను ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం విడుదల చేసింది. కాల్పుల ఘటనకు సంబంధించి అధికారులతో చర్చించినట్లు గవర్నర్ జానెట్ మిల్స్ తెలిపారు. మరోవైపు, కాల్పుల ఘటనపై అధ్యక్షుడు బైడెన్ ఆరా తీశారు.