ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భీకర దాడి చేస్తున్నారు. ఓవైపు ఆకాశంలో నుంచి రాకెట్ల వర్షం కురిపిస్తూ.. మరోవైపు నేలపై తూటాల మోత మోగిస్తున్నారు. భయంతో దాక్కున్న వారిని కూడా వెంటాడి వేటాడి చంపేస్తున్నారు. ఇజ్రాయెల్‌లో హమాస్ ముష్కరులు నరమేధం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్‌కు పలు దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే అమెరికా అండగా నిలుస్తూ ఇజ్రాయెల్‌కు కొంత సైన్యాన్ని ఆయుధాలను పంపింది.
మరోవైపు ఇజ్రాయెల్ చేసే అన్ని ప్రయత్నాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని అమెరికాతో పాటు యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌కు మద్దతుగా పలు దేశాల్లో అధ్యక్ష భవనాలు, చారిత్రక కట్టడాలను నీలం, తెలుపు వర్ణాల్లో ప్రదర్శించాయి. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం, యూకే ప్రధాని నివాసం సహా పలు చారిత్రక కట్టడాలు, అధికారిక భవనాలు నీలం, తెలుపు వర్ణాల్లో దర్శనమిచ్చాయి.
అమెరికాలో వైట్‌హౌస్, న్యూయార్క్‌లోని ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్, యూకే పార్లమెంట్ ది ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్, బ్రస్సెల్స్‌లోని ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం, ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్, బెర్లిన్‌లోని ది బ్రాండెన్‌బర్గ్ గేట్ చారిత్రక కట్టడాలపై ఇజ్రాయెల్ జెండాను, ఆ దేశ జెండాలోని నీలం, తెలుపు రంగులను ప్రదర్శించారు.