మధ్యప్రదేశ్‌లో భాజపా సర్కారు కొలువుతీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దక్షిణ ఉజ్జయిని ఎమ్మెల్యే , ఓబీసీ నేత మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుబాయి పటేల్.. యాదవ్‌తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార వేడుకకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోహన్ యాదవ్ ప్రమాణం అనంతరం.. రాజేంద్ర శుక్లా, జగదీశ్ దేవ్రా ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్య నాథ్, పుష్కర్ సింగ్ ధామి, ఏక్నాథ్ శిందే, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తదితరులు హాజరయ్యారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌ను ఎంపిక చేస్తూ ఇటీవల అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సీఎం రేసులో పలువురు రాష్ట్ర అగ్ర నేతల పేర్లు వినిపించినా.. కొత్త ముఖానికే పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయించింది. ఉజ్జయినిలో విద్యార్థి సంఘ నేతగా 1982లో ఎన్నికైన మోహన్ యాదవ్.. 2013లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికల్లో నెగ్గి, మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ సర్కారు కూలిపోయి, భాజపా తిరిగి వచ్చాక 2020లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆరెస్సె స్తోసత్సం బంధాలున్న ఆయన హిందుత్వ వాది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ 163 స్థానాలు దక్కించుకోగా.. కాంగ్రెస్ 66 స్థానాలకు పరిమితమైంది.