దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు ఆదాయ పన్నుశాఖ ఝలక్ ఇచ్చింది. జైలు శిక్ష పడిన వ్యక్తికి ఐటీ బకాయిల్లో మినహాయింపు వర్తించదని ఐటీ వర్గాలు కోర్టుకు స్పష్టం చేశాయి. 2008లో ఏసీబీ సమర్పించిన నివేదిక మేరకు ఆస్తులకు సంబంధించి రూ. 48 లక్షలు పన్ను చెల్లించాలని ఐటీ వర్గాలు చిన్నమ్మను ఆదేశించా యి. దీనిని వ్యతిరేకిస్తూ ఐటీ ట్రిబ్యునల్‌ను శశికళ ఆశ్రయించారు. ఆ పన్ను చెల్లింపు నుంచి గట్టెక్కారు. అయితే ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ ఐటీ వర్గాలు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాయి.
ఈ పరిస్థితుల్లో గత ఏడాది శశికళ తరపున కోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. ఈ పిటì షన్ల విచారణ గురువారం హైకోర్టు న్యాయమూర్తులు టీఎస్ శివజ్ఞానం, శక్తికుమార్ బెంచ్ ముందుకు వచ్చింది. శశికళ తరపు న్యాయవాదులు వాదిస్తూ.. ఇటీవల ఐటీ చెల్లింపు, బకాయిలు, జరిమానా విషయంగా కేంద్రం ఇచ్చిన మినహాయింపులకు సంబంధించిన ఉత్తర్వుల్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ మొత్తాన్ని శశికళ చెల్లించాల్సిన అవసరం లేదని వాదించారు.
కాగా అక్రమాస్తుల కేసులో శిక్ష పడ్డ శశికళకు ఈ మినహాయింపు వర్తించదని, బకాయిలు చెల్లించాల్సిందేనని ఐటీశాఖ తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. వాదనల అనంతరం శశికళ తరపు వాదనల్ని పిటిషన్ రూపంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ కేసును సెప్టెంబరు 8వ తేదీకి వాయిదా వేశారు.