Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సమసిపోయినట్టే కనిపించిన డోక్లామ్ వివాదం మళ్లీ మొదలయింది. రెండు నెలల పాటు భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన డోక్లామ్ సరిహద్దు సమస్య చర్చల ద్వారా పరిష్కారమయినట్టు కనిపించింది. డోక్లామ్ వద్ద మోహరించిన సైన్యాలను ఇరు దేశాలు ఉపసంహరించుకోవడంతో సమస్య శాంతియుతంగా ముగిసిందని అంతా భావించారు. కానీ చైనా మాత్రం తన బుద్ధి మార్చుకోవడం లేదు. ఒప్పందం ప్రకారం డోక్లామ్ సరిహద్దు నుంచి సైన్యాన్ని మోహరించిన చైనా… వివాదాస్పద ప్రాంతనికి కేవలం పదికిలోమీటర్ల దూరంలో రహదారి నిర్మాణం చేపట్టింది. సరిహద్దుల నుంచి ఉపసంహరించిన సైన్యాన్ని ఆ ప్రాంతంలో మోహరించింది. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి వివాదం మొదలయినట్టయింది.
డోక్లామ్ విషయంలో తన వైఖరిని చైనా సమర్థించుకుంటోంది. డోక్లామ్ కూడలి తమ భూభాగంలో ఉందని, చైనా విదేశాంగ శాఖ పీటీఐతో వ్యాఖ్యానించింది. చారిత్రక సరిహద్దులను రక్షించేందుకు తమ దళాలు గస్తీ నిర్వహిస్తాయని తెలిపింది. దీనిలో ఎలాంటి వివాదం లేదని పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో డోక్లామ్ వివాదం ముదిరిన సూచనలు కనిపిస్తున్నాయి.