పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్

India defeated Pak

ప్రపంచకప్‌లో దాయాది పాకిస్థాన్‌పై ఓటమెరుగని భారత జట్టు మరోమారు సత్తా చాటింది. నిన్న మాంచెస్టర్ వేదికగా జరిగిన హైవోల్టేజ్ పోరులో పాక్‌కు మరోమారు భంగపాటు ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి భారత రికార్డుకు అడ్డుకట్ట వేయాలని భావించిన పాక్ సేనకు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభం నుంచే అదరగొట్టింది. లోకేశ్ రాహుల్-రోహిత్ శర్మ జోడి తొలి వికెట్‌కు 136 పరుగులు జోడించింది. 57 పరుగులు చేసిన రాహుల్ రియాద్ బౌలింగ్‌లో బాబర్ ఆజంకు దొరికిపోయాడు. అయితే, మరోవైపు క్రీజులో పాతుకుపోయిన రోహిత్ 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌కు ఈ ప్రపంచకప్‌లో ఇది రెండో సెంచరీ. అదే జోరుతో బ్యాట్‌ను ఝళిపించిన రోహిత్ 140 పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్‌లో రియాజ్‌కు దొరికిపోయాడు.  77 పరుగులు చేసిన కోహ్లీ అవుట్ కాకుండానే అవుటని భావించి మైదానాన్ని వీడాడు. చివర్లో పాండ్య 26, విజయ్ శంకర్ 15 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. సెంచరీతో భారత జట్టును గెలిపించిన రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో భారత్ 7 పాయింట్లో మూడో స్థానానికి చేరుకుంది.