Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
21వ కామన్ వెల్త్ గేమ్స్ ముగిశాయి. ఈ క్రీడల్లో భారత్ కు పతకాల పంట పండింది. 26 బంగారు పతకాలు, 20 రజత పతకాలు, 21 కాంస్యాలు సాధించింది. మొత్తం 66 పతకాలతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 198 పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, 136 పతకాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉన్నాయి. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో భారత్ కు స్వర్ణం, రజతం లభించాయి. సైనా నెహ్వాల్ 21-18, 23-21 తేడాతో పి.వి.సింధుపై ఘన విజయం సాధించి స్వర్ణం చేజిక్కించుకుంది. సింధుకి రజతం దక్కింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ రజతం గెలుపొందాడు. కామన్ వెల్త్ గేమ్స్ లో పతకాలు గెలిచిన భారత క్రీడాకారులందరికీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు ప్రముఖులు ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా మహిళల బ్యాడ్మింటన్ లో దేశానికి స్వర్ణం, రజతం అందించిన సైనా,సింధుపై దేశవ్యాప్తంగా అభినందనల జల్లు కురుస్తోంది.
మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో స్వర్ణ, రజత పతకాలు సాధించిన సైనా నెహ్వాల్, పి.వి.సింధులకు శుభాకాంక్షలు. మీరిద్దరూ భారతమాత ముద్దుబిడ్డలు. మీరిలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. పురుషుల విభాగంలో రజతం సాధించిన శ్రీకాంత్, స్క్వాష్ డబుల్స్ లో రజతం సాధించిన దీపిక పల్లకల్, జ్యోత్స్న చిన్నప్పలకు శుభాకాంక్షలు అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. మిక్స్ డ్ డబుల్స్ లో కాంస్య పతకం చసాధించిన మనికా బాత్రా, జ్ఞానశేఖరన్ లను చూసి గర్విస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు అని ప్రధాని ట్వీట్ చేశారు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైనా, సింధులకు శుభాకాంక్షలు చెప్పాడు. వారిద్దరూ భవిష్యత్ తరాలకు రోల్ మోడల్స్ గా అవతరిస్తున్నారని కొనియాడాడు. సైనా, సింధు ఆట చూడముచ్చటగా ఉందని క్రికెటర్ రవీంద్ర జడేజా ట్వీట్ చేశాడు.