కెనడాలో వీసా సర్వీసులను పునః ప్రారంభించిన భారత్‌

International Politics: Threat calls to Indian community in Canada
International Politics: Threat calls to Indian community in Canada

కెనడాలో వీసా సర్వీసులను భారత్‌ పునః ప్రారంభించింది. సుమారు నెల తర్వాత ఇవాళ్టి నుంచి వీసా సేవలు ప్రారంభమయ్యాయి. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య అంశంపై ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దౌత్య వివాదంతో కెనడాలో వీసా సర్వీసులను భారత్‌ నిలిపివేసింది. కెనడాలో భద్రతాపరిస్థితిని సమీక్షించి వీసా సర్వీసులు పునః ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంట్రీ, బిజినెస్‌, మెడికల్‌, కాన్ఫరెన్స్‌ వీసా సేవలు ప్రారంభించినట్లు కెనడాలోని భారత హై కమిషన్ ప్రకటించింది. ఈ సేవలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది.

‘భారత దౌత్యవేత్తల భద్రత విషయంలో ఇటీవల కెనడా చేపట్టిన చర్యలను పరిగణలోకి తీసుకున్నామని భారత హైకమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. భద్రత పరిస్థితులను పరిశీలించిన తర్వాత వీసా సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఎంట్రీ వీసా, బిజినెస్​ వీసా, మెడికల్​ వీసా, కాన్ఫ్​రెన్స్​ వీసాలను అక్టోబర్ 26 నుంచి మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇటీవల.. కెనడాలోని తమ దౌత్యవేత్తల భద్రతలో పురోగతి కనిపిస్తే ఆ దేశంలో వీసా సేవలను ‘అతి త్వరలో’ పునరుద్ధరించాలని అనుకుంటున్నట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపిన విషయం తెలిసిందే.