టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌ వాయిదా

టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌ వాయిదా

ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌ను వారం పాటు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒమిక్రాన్‌కు వేరియంట్‌ తొలి కేసు వెలుగు చూసింది దక్షిణాఫ్రికాలో అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే టీమిండియా-ఏ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. కాన్పూర్ టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా జట్టు ఎంపికకు సంబంధించి సెలెక్షన్ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికి వాయిదా పడింది.

అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు 8 రోజుల క్వారంటైన్‌లో ఉండాలంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ జరగలేదని తెలుస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మంగళవారం స్పందించారు.

”బోర్డు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నందని.. పర్యటన షెడ్యూల్‌లోనే ఉంది. నిర్ణయించుకోవడానికి మాకు ఇంకా సమయం ఉంది. డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు జరగనుంది. దాని గురించి ఆలోచిస్తాం. ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యం ఎల్లప్పుడూ బీసీసీఐ మొదటి ప్రాధాన్యత. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి” అని గంగూలీ పేర్కొన్నాడు. భారత్ దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‎లు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడనుంది. అయితే కొన్ని మ్యాచ్‎లు కుదించే అవకాశముందని తేలింది.