టీమిండియా అభిమానుల్లో కలవరం

టీమిండియా అభిమానుల్లో కలవరం

డిసెంబర్‌ 16న దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనున్న భారత క్రికెట్‌ జట్టు ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన మూడు రోజుల క్వారంటైన్‌ క్యాంప్‌లో ఉంది. అయితే, టీమిండియా టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒక్కడు ఈ క్వారంటైన్‌కు డుమ్మా కొట్టడం ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను ప్రకటించిన నాటి నుంచి కోహ్లి తన ఫోన్‌ను సైతం స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వన్డే కెప్టెన్సీపై తాను ఏ నిర్ణయం తీసుకోకముందే బీసీసీఐ రోహిత్‌కు టీమిండియా వన్డే పగ్గాలు అప్పజెప్పడం సహించకే కోహ్లి ఇలా ప్రవర్తిస్తుంటాడని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. జొహనెస్‌బర్గ్‌ ఫ్లయిట్‌ ఎక్కేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం.. కోహ్లి ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంతో బీసీసీఐ వర్గాలతో పాటు టీమిండియా అభిమానుల్లో సైతం కలవరం మొదలైంది.

అయితే, కోహ్లి ఎట్టి పరిస్థితుల్లో జట్టుతో చేరతాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా, డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుతో టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటన మొదలవుతోంది. 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ అనంతరం టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లలో పాల్గొంటుంది. టెస్ట్‌ జట్టుకు కోహ్లి సారధ్యం వహించనుండగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.