ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. హమాస్ మిలిటెంట్లను సమూలంగా అంతం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ ఆ దిశగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే గాజాపై భీకర దాడులు జరుపుతోంది. ఓవైపు భూతల దాడులు.. మరోవైపు వైమానిక దాడులతో గాజాలో నరమేధం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడులతో గాజాలో సామాన్య పౌరుల బతుకు ఛిద్రమవుతోంది. ఈ దాడులను ప్రపంచ దేశాలను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇజ్రాయెల్, హమాస్‌లు చర్చలతో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నాయి.
ఓ వైపు యుద్ధ భూమిలో సామాన్యులు ప్రాణాలు కోల్పోతుటే.. మరోపక్క హమాస్ చెరలో బందీలు బిక్కుబిక్కుమంటున్నారు. తక్షణ కాల్పుల విరమణకు, బేషరుతుగా బందీల విడుదలకు డిమాండ్ చేస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీలో ముసాయిదా ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. ఐరాస అత్యవసర ప్రత్యేక సమావేశంలో భాగంగా ఈజిప్టు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 193 సభ్యదేశాల్లో 153 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. 23 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది.