అనుమానం వీడితేనే.. కరోనాపై భారత్ సక్సెస్

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 185 కు పైగా దేశాలకు వ్యాపించిన కరోనా దెబ్బకు ఆయా దేశాల ప్రభుత్వాలూ గడగడలాడి పోతున్నాయి. భారత్ తో పాటు పలు దేశాలు లాక్ డౌన్ బాట పట్టాయి. ఇటలీ, ఇరాన్, స్పెయిన్, అమెరికా ఉదంతాలు చూసిన తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. జనతా కర్ఫ్యూ మొదలు ఏప్రిల్ 14వరకు దాదాపు 24 రోజుల పాటు భారత్ లాక్ డౌన్ అయింది. మార్చి 24న ప్రధాని మోదీ ఇచ్చిన 21 రోజుల లాక్ డౌన్ తో ప్రజలంతా దాదాపుగా ఇళ్లకే పరిమితమయ్యారు.

కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటి వరకు భారత్ తీసుకున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది. ఇటలీ వంటి ఉదంతాలను చూసి భారత్ చాలా వేగంగా కరోనా కట్టడికి నడుం బిగించిందని కితాబిచ్చింది. మశూచి, పోలియో వంటి మహమ్మారులను ఎదుర్కొని వాటిని నిర్మూలించిన భారతదేశానికి కోవిద్-19 ను కూడా సమర్థంగా ఎదుర్కొని నిర్మూలించే గొప్ప సామర్థ్యం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయ పడింది. అటు అగ్రరాజ్యం నుంచి కూడా మన దేశానికి ప్రశంసలొస్తున్నాయి. కరోనా కట్టడిలో గట్టి చర్యలు తీసుకున్నామంటూ కొనియాడుతున్నారు. ఎందుకంటే మరో ఇటలీల తయారైన అమెరికా కరోనా ప్రభావిత దేశాలలో టాప్ త్రీలోకి చేరింది.అయితే భారతదేశం తీసుకున్న చర్యలే అమెరికా తీసుకుని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.

ఓ రకంగా చెప్పాలంటే ఇది కూడా నిజమే. అమెరికాలో కరోనా వ్యాప్తిని గుర్తించిన కొందరు శాస్త్రవేత్తలు రీజినల్ హెల్త్ సెంటర్ లను అప్రమత్తం చేశారు. కానీ ఒక్కడే చైనా దేశస్థుడు ఇప్పటి వరకు అమెరికా వచ్చాడు. పరిస్థితంతా అదుపులోనే ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితం అక్కడి పరిస్థితి ఇప్పుడు చేయి దాటిపోయే స్థితికొచ్చింది. మన దేశంలో అలా కాదు. చైనా, ఇటలీ, అమెరికాను చూసిన మన అధినేతలు ముందుగానే అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టుల మొదలు ఎక్కడికక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. కట్టడి చేసేందుకు ప్రయత్నించినా.. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో కర్ఫ్యూ విధించారు. ఇంకా చెప్పాలంటే విదేశాల నుంచి మనకి కరోనా ఇక రాదు. ఇక్కడున్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే చాలు వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

ఇదే విషయాన్ని స్పష్టం చేసిన బీజేపీ ఎంపి సుబ్రమణియన్ స్వామి అమెరికాలో తన స్నేహితుడు శాస్త్రవేత్త అయిన రమేశ్ స్వామి చెప్పారని ట్వీట్ చేశారు.అంతేకాకుండా అమెరికా కన్నా మన దేశంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని పైగా భారతీయుల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ అని ట్వీట్ చేశారు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండే వారిలో కరోనా వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. వారి నుంచి వ్యాధి నిరోధక శక్తి ఉన్న వారికి వచ్చే అవకాశమున్న వారిలో మాత్రం పాజిటివ్ లక్షణాలు కనిపించక పోవచ్చు.

ఇదే విషయాన్ని స్పష్టం చేశారు సుబ్రమణియన్ స్వామి. భారతీయుల శరీరతత్వం గట్టిదని విదేశాల నుంచి వచ్చిన వారి సంగతి పక్కన పెడితే ఇక్కడ ఉండే వారికి అంత ముప్పు ఉండక పోవచ్చని అన్నారు. అయితే కేవలం లాక్ డౌన్ వల్ల మనం కరోనాను తరిమివేయగలమా.. ? 21 రోజుల లాక్ డౌన్ తర్వాత కరోనా ముప్పు నుంచి భారత్ తప్పించుకున్నట్టేనా? కరోనా పెను విపత్తు నుంచి మనం ఎన్ని రోజుల్లో పూర్తిగా బయటపడగలం? అన్న ప్రశ్నలకు కొద్దిగా ఆందోళన కలిగించే సమాధానాలిస్తున్నారు శాస్త్రవేత్తలు. భారత ప్రజలు 21 రోజుల పాటు లాక్ డౌన్ లో ఉండటమంటే లాకప్ లో ఉన్నట్టు ఫీలవుతున్నారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ ముగిసిన మరుక్షణమే రోడ్లమీదకొచ్చి కరోనాను తరిమేస్తున్నట్లు తాండవం చేశారు. అసలు సోషల్ లేదా ఫిజికల్ డిస్టెన్స్ ద్వారా కరోనా బారి నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చని అందరికీ తెలుసు. కానీ.. ఇప్పటికిప్పుడు రాలేదు కదా అనే ఆలోచనే తప్ప భారత్ లో కరోనా కేసుల తీవ్రత రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందో అంచనా వేసే శక్తి మెజారిటీ భారతీయుల్లో లేదన్నది కఠోర సత్యం.

అందుకే కరోనాపై అధ్యయనం చేస్తున్నా ఇంటర్ డిసిప్లినరీ గ్రూప్ సైంటిస్టులు భారత్ ను హెచ్చరిస్తున్నారు. 135 కోట్ల జనాభా ఉన్న భారత్ లో వైద్య సదుపాయాలు… కరోనా పూర్తిస్థాయిలో విజృంభిస్తే తట్టుకొనే స్థాయిలో లేవని అభిప్రాయపడుతున్నారు. భారత్ లో కరోనా స్క్రీనింగ్ టెస్టులు తక్కువగా జరిగాయని ఇంకా చాలా అనుమానిత కేసులు టెస్ట్ చేయాల్సి ఉందని అంతమంది వైద్య సిబ్బంది ఐసోలేషన్ వార్డులు క్వారెంటైన్ కేంద్రాలు భారత్ లో లేవని అంటున్నారు.అంతేకాకుండా మార్చి 18 నాటికి 11,500 మందికి మాత్రమే స్ర్కీనింగ్ చేయగలిగారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చని అంటుంటారు. భారత్ లో కరోణ మూడో దశకు చేరుకుంటే అదుపు చేయడం చాలా కష్టమని హెచ్చరిస్తున్నారు. మే15 నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్షలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. మొదటి దశలో జరిగిన స్ర్కీనింగ్ టెస్ట్ ఆధారంగా మూడో దశలో కేసులనూ లెక్కగట్ట కూడదని హెచ్చరిస్తున్నారు. 13 రోజుల లాంగ్ ను పరిశీలిస్తే మార్చ్ 19 నాటికే అమెరికా తరహాలోనే భారత్ లోనూ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు.

అందుకే లాక్ డౌన్ తో పాటు అనుమానిత కేసులను గుర్తించడంలో భారత్ సక్సెస్ అయితే చాలా వరకు బయటపడ్డట్లేనని అంటున్నారు. లేదంటే అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే ప్రపంచ దేశాలు భయపడాల్సిన పనిలేదు. అందరూ అంచనా వేస్తున్న దానికంటే ముందుగానే కరోనా మహమ్మారి తోక ముడుస్తోంది. పరిస్ధితులు అదుపు లోకొస్తాయి అన్నారు అమెరికాకు చెందిన నోబెల్ గ్రహీత మైకేల్ ల్యావిట్. 78 దేశాల్లో కోవిడ్- 19 వ్యాప్తి మరణాల రేటుపై అధ్యయనం తర్వాతే ఈ విషయం చెప్తున్నానని స్పష్టం చేశారు.