చ‌రిత్ర సృష్టించిన కోహ్లీసేన‌

india won historic 5th oneday series against south africa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ద‌క్షిణాఫ్రికాలో కోహ్లీ సేన చ‌రిత్ర సృష్టించింది. పాతికేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ స‌ఫారీ గ‌డ్డ‌పై తొలిసారి వ‌న్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఐదో వ‌న్డేలో ఘ‌న‌విజ‌యం సాధించ‌డం ద్వారా సిరీస్ విజయంతో పాటు ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో భార‌త్ నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ కూడా నిల‌బెట్టుకుంది. తర్వాతి మ్యాచ్ లో ఓడిన‌ప్ప‌టికీ భార‌తే నంబ‌ర్ వ‌న్ గా కొన‌సాగ‌నుంది. 1992 నుంచి ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న భార‌త్ ఏ ఫార్మ‌ట్లోనూ సిరీస్ గెలుచుకుంది లేదు. అయితే అన్ని విభాగాల్లోనూ కొన్నేళ్లుగా నిల‌క‌డ‌గా రాణిస్తున్న కోహ్లీ సేన ఈ సారి ఆ లోటు తీరుస్తుంద‌న్న అంచ‌నాలు వెలువ‌డ్డాయి. కానీ అంచనాలు త‌ల‌కిందులు చేస్తూ టీమిండియా తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫ‌ల‌మై తీవ్ర విమర్శ‌లు ఎదుర్కొంది. కానీ చివ‌రి టెస్టులో పుంజుకున్న ఆట‌గాళ్లు…వ‌న్డే సిరీస్ మొద‌లైన త‌ర్వాత త‌మదైన ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించారు. దీంతో తొలి మూడువ‌న్డేల్లో భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆ ఊపులోనే నాలుగో వ‌న్డే కూడా గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకుంటుంద‌ని భావించినా…భార‌త్ విజ‌య‌ప‌రంప‌ర‌కు నాలుగో వ‌న్డేలో బ్రేక్ ప‌డింది.

స్వ‌దేశంలో అద్భుతంగా రాణించిన రోహిత్ శ‌ర్మ ద‌క్షిణాఫ్రికాలో ఏ మాత్రం రాణించ‌లేక‌పోయాడు. ఆ లోటు తీరుస్తూ ఐదో వ‌న్డేలో సెంచ‌రీతో భార‌త్ కు విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టాడు. పోర్ట్ ఎలిజ‌బెత్ లో జ‌రిగిన ఐదో వ‌న్డేలో 7 ఆతిథ్య జ‌ట్టు పై 73 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భార‌త్ ఏడు వికెట్ల‌కు 274 ప‌రుగులు సాధించింది. రోహిత్ నిల‌క‌డ‌గా ఆడుతుండ‌డం, మిగిలిన బ్యాట్స్ మెన్ కూడా రాణిస్తుండ‌డంతో భార‌త్ స్కోరు 300 దాటే అవ‌కాశం క‌నిపించింది. అయితే చివ‌ర్లో బ్యాట్స్ మెన్ త‌డ‌బడ్డారు. చివ‌రి 15 ఓవ‌ర్ల‌లో 78 పరుగులు మాత్ర‌మే చేసి నాలుగు వికెట్లు చేజార్చుకోవ‌డంతో భార‌త్ 274కే ప‌రిమిత‌మ‌యింది. 275 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలో ధాటిగానే ఆడింది. అయితే భార‌త బౌల‌ర్ల విజృంభ‌ణ‌తో 42.2 ఓవ‌ర్ల‌లో 201 ప‌రుగుల‌కే ద‌క్షిణాఫ్రికా ఆల‌వుట‌యింది.

ఆరు వ‌న్డేల సిరీస్ లో మ‌రో మ్యాచ్ మిగిలుండ‌గానే భార‌త్ 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. రోహిత్ శ‌ర్మ‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ల‌భించింది. చివ‌రి వ‌న్డే శుక్ర‌వారం సెంచూరియ‌న్ లో జ‌ర‌గ‌నుంది. ద‌క్షిణాఫ్రికా గడ్డ‌పై సిరీస్ గెలిచిన కోహ్లీ సేన‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. విజ‌యం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డామ‌ని, చివ‌రికి సాధించామ‌ని కెప్టెన్ కోహ్లీ అన్నాడు. జోహెన్స్ బ‌ర్గ్ లో మూడో టెస్టు నుంచి భార‌త్ జోరు కొన‌సాగుతోంద‌ని, స‌మ‌ష్టిగా ఆడి చ‌రిత్ర సృష్టించామ‌ని సంతోషం వ్య‌క్తంచేశాడు.