భారత్‌కు కీలక సవాలు

భారత్‌కు కీలక సవాలు

భారత్‌ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ఎకానమీ పురోగమిస్తోందని హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ) చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. అదే సమయంలో కరోనా భారత్‌కు కీలక సవాలుగా కొనసాగుతుందని కూడా అభిప్రాయపడ్డారు. హెచ్‌డీఎఫ్‌సీ 44వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి పరేఖ్‌ ప్రసంగించారు.

ఆర్థిక వ్యవస్థ మొదటి వేవ్‌లో నష్టపోయినంత రెండవ వేవ్‌లో నష్టపోలేదని పేర్కొన్నారు. దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు (600 బిలియన్‌ డాలర్లపైన) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పటిష్టంగా ఉన్నాయన్నారు. క్యాపిటల్‌ మార్కెట్లు బులిష్‌ ధోరణిని కొనసాగిస్తున్నాయని, వ్యవసాయ రంగం కూడా పురోగమిస్తోందని పేర్కొన్నారు.

ఎకానమీ పురోభివృద్ధికి కేంద్రం ఒకపక్క పలు సంస్కరణాత్మక చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరమైన పటిష్ట చర్యలను కొనసాగిస్తోందన్నారు. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు ఎదురుకాకుండా ఆర్‌బీఐ సమర్థవంతమైన విధానాలను అనుసరిస్తోందన్నారు. దేశంలో ఇంకా రుణ వృద్ధి రేటు మెరుగుపడాల్సి ఉందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సవాళ్లు కొనసాగుతున్నాయని, రికవరీ ఒడిదుడుకులకు గురవుతోందని పేర్కొన్నారు. గృహ రుణాలు, కమర్షియల్‌ రియల్టీ, గోడౌన్లు, ఈ-కామర్స్‌ విభాగాల నుంచి దేశంలో రుణాలకు డిమాండ్‌ ఉందని ఈ సందర్భంగా తెలిపారు. డిజిటల్‌ ఇన్‌ఫ్రా రంగం కూడా పురోగమిస్తోందన్నారు. కాగా హెచ్‌డీఎఫ్‌సీ ఈఆర్‌జీఏ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిస్టింగ్‌ ప్రణాళికలు తక్షణం ఏమీ లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.