నాసా బృందంలో భారతీయ అమెరికన్

నాసా బృందంలో భారతీయ అమెరికన్

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ప్రయివేట్ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌.. నలుగురు వ్యోమగాములను బుధవారం అంతరిక్ష కక్ష్యలోకి పంపాయి. ఇందులో 600వ వ్యక్తి అంతరిక్ష యాత్రకు వెళ్లినట్లు నాసా వర్గాలు తెలిపాయి. 60 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో.. జర్మనీకి చెందిన మథియాస్ మౌరర్ ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నాయి. ఈ వ్యోమనౌక బయలు దేరిన 24 గంటల్లోపు ఈ నలుగురు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి  చేరుకోనున్నారు.

స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌక నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్ నుంచి భూమికి తీసుకొచ్చిన రెండు రోజుల తర్వాత పలుమార్లు అంతరాయాల మధ్య బుధవారం బయలుదేరినట్లు నాసా పేర్కొంది. రెండు దశల ఫాల్కన్ 9 రాకెట్‌ క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌తో కూడిన స్పేస్‌ఎక్స్ వాహనం, ఫ్లోరిడాలోని నాసా (NASA)కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు బయలుదేరింది. రాకెట్‌లోని తొమ్మిది మెర్లిన్ ఇంజిన్‌లు ఏకకాలంలో ప్రారంభమయ్యాయి.

డ్రాగన్ వ్యోమనౌక ప్రయాణానికి ఎండ్యూరెన్స్ అనే పేరును సూచించారు. అంతకు ముందు రోజు అడపాదడపా వర్షం కురవడం సహా ప్రతికూల వాతావరణంతో ప్రయోగ అవకాశాలపై సందేహం నెలకుంది. అయితే, చివరకు ప్రయోగం విజయవంతంగా జరిగింది.

కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన 10 నిమిషాల తర్వాత రాకెట్ పైభాగం తెరుచుకుని స్పేస్ కాప్స్యూల్ భూ కక్ష్యలోకి చేరింది. రాకెట్ పునర్వినియోగ దిగువ దశ మిగిలిన వ్యోమనౌక నుంచి వేరుపడి అట్లాంటిక్‌లోని ల్యాండింగ్ ప్లాట్‌ఫారమ్‌పై సురక్షితంగా కిందకు దిగింది. అమెరికాకు చెందిన ముగ్గురు ఆస్ట్రోనాట్స్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మథియాస్ మౌరర్ ఇందులో వెళ్లారు.

అమెరికా వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన రాజా చారి ఉన్నారు. రాజా చారి అమెరికా ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం మిషన్ కమాండర్‌, టెస్ట్ పైలట్‌‌గా పనిచేస్తున్నారు. మిషన్ స్పెషలిస్ట్ కైలా బారన్ US నేవీ సబ్‌మెరైన్ ఆఫీసర్, న్యూక్లియర్ ఇంజనీర్. ఈ బృందంలో సెకండ్-ఇన్-కమాండ్ వ్యోమగామి టామ్ మార్ష్‌బర్న్ నాసా మాజీ ఫ్లైట్ సర్జన్. గతంలో రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లివచ్చారు.

చారి, బారన్‌లు తొలిసారి అంతరిక్ష యాత్రకు వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన 599వ, 600 వ్యక్తులు. NASA భవిష్యత్తు అంతరిక్ష మిషన్‌ల కోసం ఎంపిక చేసిన 18 మంది వ్యోమగాముల మొదటి బృందంలో చారి, బారన్ ఉన్నారు. మరో పదేళ్ల తర్వాత అపో వ్యోమనౌక చంద్రునిపై దిగి అర్ధ శతాబ్దం పూర్తవుతుండగా మానవులను చంద్రునిపైకి తిరిగి తీసుకురావాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది.

క్రూ-3 మిషన్‌కు రాజాచారి కమాండర్‌గా వ్యవహరిస్తుండగా.. ఆయనతో పాటు మిషన్‌ స్పెషలిస్ట్‌గా అమెరికా నేవీ సబ్‌మెరైన్‌ అధికారి కేలా బారన్‌, నాసాకు చెందిన టామ్‌ మార్ష్‌బర్న్‌ పైలట్‌గా, ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన మత్తియాస్‌ మౌరర్‌ మిషన్‌ స్పెషలిస్ట్‌గా వెళ్లారు. వీరు ఆరు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు.