వెస్టిండీస్‌తో తొలి వన్డే ముందు భారత జట్టులోని స్టార్ క్రికెటర్లు శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్‌తో సహా మరో 5 మంది సహాయ సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 6న జరగనున్న భారత్- వెస్టిండీస్ తొలి వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక వేళ భారత జట్టులో మరిన్ని పాజిటివ్ కేసులు నమోదైతే సిరీస్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టీమ్ మొత్తం ఐసోలేషన్‌లో ఉంది. అంతేకాకుండా గురువారం జరగాల్సిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దు చేయబడింది.
ఇక జట్టులో ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో భారత వన్డే జట్టులో మనీష్ పాండేను సెలెక్షన్ కమిటీ చేర్చింది. వెస్టిండీస్‌తో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. “ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారమే భారత్- వెస్టిండీస్ సిరీస్ జరగనుంది. అయితే భారత శిబిరంలో మరిన్ని పాజిటివ్ కేసులు నమోదైతే సిరీస్ ఒకట్రెండు రోజులు వాయిదా పడే అవకాశం ఉంది” అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.