రాము ‘ఎస్’ అన్నవాడికి దిల్ రాజు దగ్గర ‘నో’ ఛాన్స్… నో అన్నవాడికి ఛాన్స్.

Indraganti Mohan Krishna to do movie in Dil Raju Banner

దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడం అంటే ఎవరికైనా గౌరవమే. అలాంటిది మూడు సినిమాలు చేసిన హరీష్ శంకర్ కి ఇప్పుడు ఆ బ్యానర్ లో సినిమా ఛాన్స్ పోయింది అంటున్నారు. ఆ స్థానాన్ని ఇప్పుడు ఇంద్రగంటి సినిమా పూరించబోతోంది అని టాక్. అయితే విశేషం ఏమిటంటే ఈ ఇద్దరు ఒకప్పుడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర పని చేసినవాళ్ళే. మధ్యాహ్నం హత్య అనే సినిమాకి ఇంద్రగంటి పని చేశారు. అయితే కొంత పని అయ్యాక రషెస్ చూసిన రామ్ గోపాల్ వర్మ సినిమా తాను అనుకున్నట్టు రాలేదని అతనికి మర్యాదగా నో చెప్పేసారు. ఇక షాక్ సినిమాకి వచ్చేసరికి డిస్కషన్స్ లో హరీష్ ఐడియాస్ నచ్చి అతనికి దర్శకత్వం ఛాన్స్ ఇచ్చాడు వర్మ. అప్పుడు వర్మ ఎస్ అన్న హరీష్ కి ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ నో చెప్పింది. అప్పుడు వర్మ నో చెప్పిన ఇంద్రగంటికి వెల్ కం చెప్పింది . ఇందులో నిజానిజాలు ఏంటో తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తే ఏదో ఓ విషయం బయటకు వస్తుంది. కానీ కాస్త జాగ్రత్తగా చూస్తే దూరం నుంచే ఈ మార్పుకి కారణాలు అర్ధం అవుతాయి.

హరీష్ శంకర్ కి, ఇంద్రగంటి కి మధ్య తేడా ఒక్క సినిమా ఛాన్స్ మాత్రమే కాదు. ఎంతో వుంది. అవేంటో చూద్దాం. తొలిచిత్రం షాక్ నుంచి హరీష్ శంకర్ అన్ని పెద్ద పెద్ద బ్యానర్ లలోనే పని చేశారు. గబ్బర్ సింగ్ లాంటి సక్సెస్ తర్వాత టాప్ హీరోలంతా ఆయన కోసం ఎదురు చూసారు. ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తే “రామయ్యా వస్తావయ్యా “ చేశారు. ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఇంకో దిల్ రాజు వరసగా అవకాశాలు అవకాశాలు ఇచ్చారు. అయితే గబ్బర్ సింగ్ తర్వాత ఆ స్థాయి విజయం దక్కలేదు. అయినా దిల్ రాజు బ్యానర్ లో వరస అవకాశాలు వచ్చాయి. ఆస్థాన డైరెక్టర్ అయిపోయాడు అనుకున్న తరుణంలో “దాగుడు మూతలు” సినిమాతో బ్రేక్ పడింది. హరీష్ శంకర్ టాలెంట్ విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. అయితే చుట్టూ ఓ కంఫర్ట్ జోన్ ఏర్పడిపోవడంతో కొత్త తరహా ఆలోచనలకు తావు లేకుండా పోయింది. రొటీన్ సినిమాలు… ఓ ఫార్మాట్ కి అలవాటు పడ్డ సినిమాలు తీయడం అలవాటు అయిపొయింది. ఫలితం దానికి తగ్గట్టే వుంది. హరీష్ క్రియేటివిటీ కి తగ్గట్టు ఒక్క ఛాలెంజ్ కూడా ఎదురు కాలేదు.

ఇక మధ్యాహ్నం హత్య సినిమాలో వర్మ నుంచి ప్రతికూలత ఎదుర్కొన్న ఇంద్రగంటి ఆ తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకోడానికి గ్రహణం తీయాల్సి వచ్చింది. ఆ సినిమాతో వచ్చిన పేరుతో మాయాబజార్ ఛాన్స్ దక్కినా పెద్దగా ఆడలేదు. దీంతో రెండేళ్ల కష్టపడితే అష్టా చెమ్మా ఛాన్స్ దొరికింది. అది హిట్ అయ్యాక గోల్కొండ హై స్కూల్, అంతకుముందు ఆ తర్వాత పర్వాలేదు అనిపించాయి. కానీ ఆ తర్వాత ఇదే బ్యానర్ లో తీసిన బందిపోటు పెద్ద డిసాస్టర్. దీంతో ఇంద్రగంటి ఇంకో సారి తనను తాను నిలబెట్టుకునేందుకు సరికొత్తగా , తన బ్రాండ్ కి కాస్త దూరంగా చేసిన ప్రయత్నం జెంటిల్ మ్యాన్ హిట్ కావడంతో ప్రయోగాలకు సిద్ధపడ్డారు ఆయన. అమితుమీ, సమ్మోహనం కూడా హిట్ అయ్యాయి. ఇంద్రగంటి వేర్వేరు సంస్థలు, వివిధ స్థాయుల్లో వున్న నటీనటులతో కలిసి పని చేశారు. ఎన్నో ఛాలెంజ్ లు ఎదుర్కొన్నారు. ఈ గడ్డు ప్రయాణంలో రాటుదేలిన ఇంద్రగంటి చెప్పిన కదా మాత్రమే ఆయనకి దిల్ రాజు బ్యానర్ లో అవకాశం దక్కేట్టు చేసింది. సవాళ్లు, ఇబ్బందులతో మనిషిలో శక్తిసామర్ధ్యాల్ని వెలికి తీయొచ్చు. ఆ సవాళ్లకు ప్రయోగాలు తోడు అయితే ఇంకా సక్సెస్ అవ్వొచ్చు . క్రియేటివ్ ఫీల్డ్ కి కూడా ఈ సూత్రం పని చేస్తుందని ఇంద్రగంటి కెరీర్ గ్రాఫ్ సూచిస్తోంది.