వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో విల‌క్ష‌ణ నేత‌

Interesting News OnFormer AP Minister Anam Vevikanand

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో విల‌క్ష‌ణ నేత‌గా గుర్తింపుతెచ్చుకున్న ఆనం వివేకానంద‌రెడ్డి మృతితో సింహ‌పురి చిన్నబోయింది. నెల్లూరులోని వీధివీధిలో అభిమానుల‌ను సంపాదించుకున్న ఆనం మృతితో వారంద‌రూ కంట‌త‌డి పెడుతున్నారు. సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కులు…లోప‌ల జీవించే విధానం ఒక‌లాఉంటుంది…బ‌య‌ట‌కు క‌నిపించే విధానం మ‌రోలా ఉంటుంది. కానీ ఆనం వివేకా జీవితం మాత్రం తెర‌చిన పుస్త‌క‌మే…అంద‌రికీ తెలిసేలానే ఆయ‌న విలాస‌వంత‌మైన జీవితం అనుభ‌వించారు. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌లతో మ‌మేక‌మై పోయారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో నెల్లూరు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన వివేకానంద‌రెడ్డి…సాధార‌ణ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మాత్రం ఎప్పుడూ అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శించలేదు.

గ‌న్ మెన్లు లేకుండా ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోయేవారు. ఎవ‌రు స‌మస్య‌ల్లో ఉన్నా త‌క్ష‌ణ‌మే స్పందించేవారు. ప‌ద‌వులకోస‌మే రాజ‌కీయాలు అన్న భావ‌న వివేకాకు ఉండేది కాదు. వైఎస్ స్వ‌యంగా పిలిచి మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్నా…సున్నితంగా తిర‌స్క‌రించి త‌న త‌మ్ముడైన రామ‌నారాయ‌ణ‌రెడ్డికి ప‌ద‌వి ఇప్పించారు. ఎమ్మెల్యేగా సింహ‌పురి వాసుల‌కు త‌ల‌లో నాలుక‌లా వ్య‌వ‌హ‌రించారు. అటు త‌న వ్య‌క్తిగ‌త ఇష్టాల‌ను ఏమాత్రం ప‌క్క‌న‌పెట్టలేదు. నెల్లూరులో ఉన్న‌న్ని రోజులూ చూసిన సినిమానే అయినా రోజూ సెకండ్ షో చూడ‌న‌ది ఇంటికివెళ్లేవారు కాదు. సాధార‌ణ వ్య‌క్తిలా రోడ్డుప‌క్క‌న దాబాలో కూర్చుని బిర్యానీ తినేవారు. రాజ‌కీయ‌నాయ‌కుడిగా అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండాల్సిన వివేకా…అంద‌రిముందే గుప్పుగుప్పు మంటూ సిగ‌రెట్ తాగ‌డంపై అనేక విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యేవి. అయినా వాటిని ప‌ట్టించుకునేవారు కాదు. అలాగే ఎదుటి వ్య‌క్తి ఎంత‌టి వారైనా స‌రే…వారిపై సెటైర్లు వేయ‌డానికి ఏమాత్రం ఆలోచించేవారు కాదు…రాజ‌కీయాల్లో తీవ్ర ఒత్తిళ్ల మ‌ధ్య ఉంటూ కూడా ఆయ‌న అంత ఆనందంగా, కులాసాగా జీవితాన్ని గ‌డిపిన వ్య‌క్తి మ‌రొక‌రు లేరు. అందుకే తెలుగు రాజ‌కీయాల్లో ఆయ‌న లేని లోటు పూడ్చ‌లేనిది.