ఉపవాసంతో ఆరోగ్యం…

intermittent-fasting-is-good-for-you

ఉపవాసం అనేది ప్రత్యేకం గా పర్వదినాల్లో లేదా ఆరోగ్యం కోసం లేదా వారంలో ఒకరోజు మనకు తెలిసి వుంటూ ఉంటారు. ఇప్పుడు శాస్త్ర పరిశోధనలూ అండగా నిలబడుతున్నాయి. ఉపవాసం ఒంటికి మంచిదనీ, లంఖణం పరమౌషధమనీ చాలాకాలంగా వింటూనే ఉన్నాం. దీన్నే వైద్యపరిభాషలో ఇప్పుడు ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ – ఐఎఫ్‌’ జబ్బులను తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు ఇటీవలి కాలంలో నిర్ధారణకు వస్తున్నారు.

ఉపవాసం చెయ్యటం వల్ల బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గేందుకు దోహదం చెయ్యటమేకాదు.. ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్‌ స్థాయులూ తగ్గుతున్నాయని గ్రహించారు. వీటన్నింటి ఫలితంగా గుండె జబ్బు, పక్షవాతం వంటి వ్యాధుల బారినపడే అవకాశాలూ తగ్గుతున్నాయని వీరు క్రమేపీ గుర్తిస్తున్నారు.

మనం తిన్న ఆహారం రెండుమూడు గంటల్లో జీర్ణమై, రక్తంలో కలిసి ప్రయాణించి, కాలేయంలో గానీ, కండరాల్లో గానీ కొవ్వులా నిల్వ ఉంటుంది. ఎలాగంటే ఆహారంలోని పిండి పదార్ధాలు గ్లూకోజుగా మారి, రక్తంలోకి వెళ్లి కాలేయంలో గానీ, కండరాల్లో గానీ గ్లైకోజెన్‌గా నిల్వ ఉంటాయి. అలాగే కొవ్వు పదార్ధాలు ఫ్యాటీ ఆమ్లాలుగా మారి, అంతిమంగా ట్రైగ్లిజరైడ్లగానో, కొలెస్ట్రాల్‌గానో మారతాయి. మాంసకృత్తులు అమైనో ఆమ్లాలుగా మారి, రక్తంలోకి వెళ్లి రకరకాల ప్రోటీన్లుగా మారతాయి. ఇలా మనం తీసుకున్నవన్నీ రకరకాల రూపాల్లో మారి, శరీరంలో నిల్వ ఉంటాయి. దీన్ని ‘పోస్ట్‌ అబ్జార్బిటివ్‌ ఫేజ్‌’ అంటారు. ఇలా నిల్వ ఉంచుకున్న వాటినే మన శరీరం శక్తి అవసరాలకు వాడుకుంటుంంది. కాబట్టి కొన్ని గంటల పాటు మనం ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటే- మన శరీరం తన శక్తి అవసరాల కోసం కండరాల్లో, కాలేయంలో, కొవ్వులో అప్పటికే దాచుకున్న నిల్వలను కరిగించుకోవటం మీద ఆధారపడటం మొదలుపెడుతుంది.

ఉపవాసం ఉన్న రోజున శరీరానికి ఆహార లభ్యత ఆగిపోగానే మెదడు దాన్నొక సవాల్‌గా స్వీకరిస్తుంది. వెంటనే ఈ ఒత్తిడి పరిస్థితిని నెగ్గుకొచ్చేందుకు తక్షణ చర్యలు తీసుకునే క్రమంలో ఒంట్లో వ్యాధుల ముప్పు తగ్గించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశోధనల్లో గుర్తించారు. మెదడులో ప్రోటీన్ల తయారీ మెరుగై, నాడీకణాల్లో మైటోకాండ్రియా కూడా పెరుగుతూ, నాడీకణాల మధ్య సంబంధాలూ మెరుగవుతున్నాయి. దీనివల్ల మెదడు పనితీరు, విషయగ్రహణ శక్తి మెరుగవ్వటమే కాదు, పార్కిన్సన్స్‌, ఆల్జిమర్స్‌ వంటి వ్యాధుల ముప్పూ తగ్గుతోందట.

ఉపవాస పద్ధతి క్యాన్సర్‌ నివారణకూ మెరుగైన విధానంగా ఉపయోగపడగలదని పరిశోధకులు భావిస్తున్నారు.

తేలికగా ఉపవాసం

why should we do Fasting and Fasting uses
* మొదట్లో ఆహారం ఏకబిగిన అరపూట, పూట మానేసే కంటే కొద్ది గంటల పాటు మానేస్తూ క్రమేపీ శరీరానికి అలవాటు చెయ్యటం మంచిది.
* ఉపవాసం తర్వాత తీసుకునే ఆహారం తేలికగా ఉంటే మంచిది. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తేలికపాటి మాంసం వంటివి ఉండేలా చూసుకోవాలి. ఉపవాసం ముగిస్తున్నామని అతిగా తినెయ్యకుండా.. మిగతా రోజుల్లో ఎలా తీసుకుంటారో ఆ రోజూ అలాగే తినాలి.
* పని ఎక్కువగా ఉన్న రోజున ఉపవాసం పెట్టుకుంటే మనసులో రోజంతా తిండి గురించే ఆలోచించటమన్నది తగ్గిపోతుంది.
* ఉపవాసం రోజున తేలికపాటి, ఉల్లాసభరితమైన పనులు చెయ్యటం వల్ల శరీరం, మనుసూ.. రెండూ తేలికపడతాయి.
* ఒకవేళ ఆహారం కోసం తహతహ ఆరంభమైతే కొద్దిదూరం నడకకు వెళ్లటమో.. మిత్రులతో మాటలు కలపటమో.. టీవీ చూడటమో.. ఇలా ఏదో ఒకటి చేసి తిండి మీంచి మనసు మళ్లించటం మంచిది.
* ఉపవాస సమయంలో నీరు, ద్రవాహారం మాత్రం దండిగా తీసుకోవాలి. ఒంట్లో నీరు తగ్గకూడదు. అయితే తీపి పానీయాలు, చక్కెర వేసిన కాఫీ టీలకు దూరంగా ఉండాలి.
* ఎంత ప్రయత్నించినా ఇక తినకుండా ఉండలేమని అనిపించినప్పుడు.. మొండిగా అలాగే ఉండిపోకుండా తేలికపాటి ఆహారం తీసేసుకోవటం ఉత్తమం.
* ఇలా నాలుగైదు వారాలు ప్రయత్నించే సరికి శరీరం ఉపవాసం, ఆ కొత్త దినచర్యకు అలవాటు పడుతుంది. ఆ తర్వాత ఉపవాసం ఉల్లాసంగా గడుస్తుంది.
*చిన్నపిల్లలు, అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లులు, బరువు తక్కువగా ఉన్నవాళ్లు, మధుమేహలు… వీరంతా ఉపవాసాలు చెయ్యకూడదు. తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఉపవాసం చేయాలి.ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు నడుచుకోవాలి.