టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాను డ్రగ్స్ వినియోగించినట్లు అంగీకరించారు. మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు వైద్యుడి సూచన మేరకు కెటమిన్ అనే డ్రగ్‌ను తీసుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది తన ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్టుబడి సంబంధాలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండు నెలల క్రితం మస్క్ డ్రగ్స్ వినియోగంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో మస్క్ తరచుగా పాల్గొంటూ.. నిషేధిత డ్రగ్స్‌ను తీసుకుంటున్నారని, దీనిపై టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని కథనంలో పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా డ్రగ్స్ వినియోగంపై స్వయంగా మస్క్ స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
గతంలో తన మెదడులో సంభవించిన మార్పుల వల్ల మానసిక కుంగుబాటుకు గురయ్యానన్న మస్క్.. ఆ సమయంలో దాన్నుంచి బయటపడేందుకు కెటమిన్ ఉపయోగపడిందని చెప్పారు. వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి చిన్న మొత్తంలో దాన్ని తీసుకునేవాణ్నని తెలిపారు