ఐపీఎల్ 2019 షెడ్యూల్…4 రోజుల్లో ?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్‌ 2019 సీజన్ పూర్తి షెడ్యూల్‌ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 23 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూసిన బీసీసీఐ గత నెలలో తొలి 14 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్‌ని మాత్రమే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏ ఏ ప్రాంతాల్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి ? అనేదానిపై పూర్తిగా స్పష్టత రావడంతో ఎన్నికలకి అనుగుణంగా భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బీసీసీఐ షెడ్యూల్‌ని రూపొందిస్తోంది. ఐపీఎల్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో ప్రతి జట్టూ కనీసం ఏడు మ్యాచ్‌ల్ని సొంతగడ్డ మీద ఆడాలి. కానీ ఎన్నికల నేపథ్యంలో.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సొంతగడ్డపై ఏడు మ్యాచ్‌ల్ని ఆడే అవకాశాలు కన్పించడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, 12, 19 తేదీల్లో మొత్తంగా ఏడు రోజులు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్క కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కే కాక టోర్నీలోని అన్ని జట్లకీ ఈ ఇబ్బంది ఎదురయ్యేలా కనిపిస్తోంది.