సిరియాలో ఇరాన్ దౌత్యవేత్తగా పనిచేసిన హోసేన్ షేఖోస్లామ్ కరోనా వైరస్‌తో చనిపోయినట్టు ఆ దేశ అధికారిక మీడియా గురువారం ప్రకటించింది. గురువారం మరో 15 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ ఆరోగ్య, వైద్య విద్యా శాఖ వెల్లడించింది. మొత్తం 107 మంది మృత్యువాత పడగా, 3,513 కేసులు నమోదయినట్టు తెలిపింది. అటు చైనాలో కరోనా మరణాలు 3,042కి చేరుకోగా, బాధితుల సంఖ్య 80,552గా నమోదయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,400 మంది మృత్యువాతపడ్డారు.
కరోనా వైరస్‌తో గురువారం మరో 30 మంది చనిపోయినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. అలాగే కొత్తగా 143 మందికి వైరస్ లక్షణాలు ఉన్నట్టు నిర్ధరాణ అయ్యిందని తెలిపింది. బుధవారం ఈ సంఖ్య 139 కాగా, గురువారం నాటికి స్వల్పంగా పెరిగింది. దక్షిణ కొరియాలో కరోనా మరణాలు 42కి చేరుకోగా, బాధితుల సంఖ్య 6,300 దాటింది. చైనాలోని వుహాన్ మాదిరిగా దక్షిణ కొరియాలోని డేగూ నగరం వైరస్‌కు కేంద్రస్థానంగా మారింది. శుక్రవారం కొత్తగా 518 కేసులు నమోదయ్యాయి.