కోమటిరెడ్డి కూడా హస్తానికి హ్యాండ్ ఇచ్చినట్టేనా ?

is komati reddy also leave congress

రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంపై ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి  ఆ పార్టీ షో కాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన రాజకీయ భవిష్యత్‌ మార్చుకునే పనిలో పడ్డారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌ పాలనకు ఎదురొడ్డి నిలిచే శక్తి కాంగ్రెస్‌కు లేదని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆయన కుండబద్ధలు కొట్టారు. దీంతో ఈ ప్రకటనతో ఆయన కాంగ్రెస్‌ గూటిని వీడి కమలం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు అన్న అభిప్రాయం బలపడింది. కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సమయంలోనే తాను బీజేపీలో చేరాలని ఇంకా నిర్ణయించుకోలేదని, నియోజకవర్గంలో తన అనుచరులు,  కుటుంబ సభ్యులతో మాట్లాడాక ఓ నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. రెండు మూడు రోజులుగా ఇలాంటి ప్రకటనలు చేయకుండా మౌనంగా ఉన్న రాజగోపాల్‌ రెడ్డి  నిన్న హైదరాబాద్‌లోని తన నివాసంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తలు, అనుచరులతో భేటీ అయ్యారు. నేతలతో సమావేశమైన ఆయన, బీజేపీలో చేరితే కలిగే లాభాలను గురించి వివరించి, వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అతి త్వరలోనే బీజేపీలో పెద్దఎత్తున చేరికలు చూడబోతున్నామని ఆయన అన్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు సమాచారం. 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందని, ఆ దిశగా స్థానిక నేతలకు ఆ పార్టీ కేంద్ర నాయకత్వం పూర్తి సహాయ, సహకారాలను అందించనుందని చెప్పిన ఆయన, ముందుగానే బీజేపీలోకి చేరితే బాగుంటుందని అభిప్రాయపడ్డట్టు ఆయన అనుచరులు అంటున్నారు. ఈరోజు మరోమారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భేటీ కావాలని,  ఈ అంశంపై కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశాన్ని ముగించారని సమాచారం.