వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ కీలక నిర్ణయం

jagan key decision on ys viveka murder case

ఈ ఏడాది మార్చిలో హత్యకు గురైన మాజీ మంత్రి, వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం  అనంతపురం, చిత్తూరు, తిరుపతికి చెందిన పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఈ బృందం దర్యాప్తును ముమ్మరం చేయనుంది. కొత్త బృందం బుధవారం వైఎస్ వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించింది.  అనంతపురం జిల్లా పెనుగొండ డీఎస్పీ రామకృష్ణ, పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌, సీఐలు శ్రీరాం‌, అమిత్‌ఖాన్‌, రామాంజినాయక్‌, పలువురు ఎస్‌ఐలు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పులివెందులలోని వివేకానందరెడ్డి ఇంటికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వాచ్‌మన్‌ రంగయ్యను విచారించారు. మార్చి 15న జరిగిన వివేకా హత్యకేసు అప్పట్లో పెను సంచలనమైంది. ఈ హత్యకేసుపై వెంటనే స్పందించిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, ఎన్నికల నేపథ్యంలో దర్యాప్తు ముందుకు సాగలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం తాజాగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి మార్చి 15వ తేదీన పులివెందులలోని తన ఇంట్లో దారుణహత్యకు గురయ్యాడు. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో ఉన్న ఆయన్ని అనుచరులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో కింద పడిపోయి తీవ్ర గాయాలైనట్లు ఆయన అనుచరులు మీడియాకు చెప్పారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆయన హత్యకు గురైనట్లు తేలడంతో అంతా షాకయ్యారు. వివేకా హత్య రాజకీయ రంగు పులుముకోవడంతో గత ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కేసు విచారణ ముందుకు సాగలేదు.