బీజేపీలోకి ఏపీ టీడీపీ నేతలు ?

Is-Sadineni-Yamini-Joining-The-BJP

ఏపీలో బంపర్ మెజారిటీతో గెలిచిన వైసీపీ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించకపోవడంతో అసంతృప్త నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. ఏపీలో బలమైన పక్షంగా ఎదగాలని వ్యూహరచన చేస్తున్న కమలనాథులు కూడా వలసలను ప్రోత్సహిస్తున్నారు.

అయితే, టీడీపీలో ఫైర్ బ్రాండ్లుగా పేరుపొందిన సాదినేని యామిని, దివ్యవాణి కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  ఇటీవల కాలంలో వీరిద్దరు తెరపైకి రాలేదు. దాంతో వారు పార్టీ మారుతున్నారంటూ సాగుతున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టయింది.

కొన్నిరోజుల క్రితం యామిని సాదినేని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను కలవడంతో ఆమె కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటూ కథనాలు వెల్లువెత్తాయి. అయితే చిన్న చిన్న విషయాలకే స్పందించే యామిని దీని మీద సమాధానం ఇవ్వలేదు.

కార్యకర్తగా పార్టీలోకి వచ్చిన ఆమె సోషల్ మీడియాలో వైసీపీ అధినేత జగన్ పైనా, ఆ పార్టీ నేతలపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేసి టీడీపీ అధిష్ఠానం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఆమెకు అధికార ప్రతినిధి హోదా దక్కింది. దాంతో మరింత విజృంభించిన యామిని జనసేనాని పవన్ కల్యాణ్ పై భారీ స్థాయిలో విరుచుకుపడింది.

పవన్-మల్లెపూలు ఎపిసోడ్ తో ఆమెకు ఎక్కడలేని పాప్యులారిటీ ఇచ్చింది. ఓ దశలో ఆమె పార్టీ టికెట్ ఆశించినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ పరంగా ఆమె నుంచి ఎలాంటి స్పందనలేదు. దివ్యవాణి కూడా చాలాకాలంగా మీడియా ముందుకు రావడంలేదు.

ఎన్నికల ముందు వైసీపీ నేతలను కడిగిపారేసిన దివ్యవాణి, ఎన్నికల ఫలితాల తర్వాత ఓ రెండుమూడు సార్లు హడావుడి చేసింది తప్ప ఆపై తాను కూడా తెరమరుగైంది. ఆమె కూడా బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.